సెన్సార్‌షిప్‌తో క్రియేటివిటీకి సంకెళ్లు.. 35 ఏళ్ల నాటి పాత చట్టాలు మారేదెప్పుడు? : చిత్ర పరిశ్రమలో కొత్త చర్చ!

సెన్సార్‌షిప్‌తో క్రియేటివిటీకి సంకెళ్లు.. 35 ఏళ్ల నాటి పాత చట్టాలు మారేదెప్పుడు? : చిత్ర పరిశ్రమలో కొత్త చర్చ!

సినిమాలు సమాజానికి అద్దం పట్టాలి.. కానీ ఆ అద్దంలో ఏం కనిపించాలో కూడా సెన్సార్ బోర్డే నిర్ణయిస్తే ఎలా? ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో ఇదే ప్రశ్న తీవ్ర చర్చకు దారితీస్తోంది. అసలు భయం నుంచి పుట్టేదే సెన్సార్‌షిప్.. అది అజ్ఞానానికి తండ్రి, నియంతల ఆఖరి ఆయుధం అన్న అమెరికన్ రచయిత లారీ హాల్స్ ఆండర్సన్ చెప్పిన మాటలు.. నేటి భారతీయ సినిమా రంగానికి సరిగ్గా సరిపోతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

సెన్సార్ తో క్రియేటివిటీని అణచివేత..?

ప్రజాస్వామ్యంలో ప్రేక్షకులకు ఎలాంటి సినిమాలు సరిపోతాయో వర్గీకరించడం వేరు . అసలు దర్శకుడు ఏం తీయాలో ఆదేశించడం వేరు. కానీ మన దేశంలో ఏళ్లనాటి సెన్సార్‌షిప్ నియమాలు కళాకారుల స్వేచ్ఛను, క్రియేటివిటీని దారుణంగా అణచివేస్తున్నాయన్న ఆవేదన సినీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. 35 ఏళ్ల నాటి సెన్సార్ బోర్డు మార్గదర్శకాలను మార్చాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ వినిపిస్తోంది.

1991 నాటి నిబంధనలు..

1991లో రూపొందించిన 'సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్' (CBFC) గైడ్‌లైన్స్‌నే ఇప్పటికీ అమలు చేయడం పెను సవాలుగా మారింది. ఈ మార్గదర్శకాల్లో హింస, మాదకద్రవ్యాలు, అశ్లీలత, రాజకీయ అంశాలు, దేశ ప్రతిష్ఠ వంటి విషయాలకు సంబంధించిన పరిమితులు ఉన్నాయి.  అయితే ఈ35 ఏళ్ల క్రితం నాటి ఈ నిబంధనల్లో 'అతిగా', 'శాంతిభద్రతలు', 'యాంటీ నేషనల్' వంటి పదాలకు స్పష్టమైన నిర్వచనాలు లేవు. ఒక సినిమాలో హింస, డ్రగ్స్, రాజకీయ కోణాలు చూపించినంత మాత్రాన అది సమాజానికి ముప్పుగా మారదంటున్నారు కొందరు నిర్మాతలు.. 

►ALSO READ | Ram Charan : రామ్ చరణ్ సరసన సారా అర్జున్? సుకుమార్ సినిమాలో క్రేజీ కాంబినేషన్‌పై భారీ బజ్!

'సత్య', 'రంగ్ దే బసంతి', 'ఉడ్తా పంజాబ్', 'కబీర్ సింగ్' వంటి సినిమాలు సమాజంలోని లోపాలను, చేదు నిజాలను అద్దం పట్టి చూపించాయే తప్ప నేరాలను ప్రోత్సహించలేదు. పాత్రలు తప్పులు చేసినంత మాత్రాన ఆ తప్పులను సినిమా సమర్థిస్తున్నట్లు కాదని నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు. సుప్రీంకోర్టు కూడా హింస, అశ్లీలత కథలో భాగమైనప్పుడు దాన్ని సినిమాటిక్ రెస్పాన్సిబిలిటీగానే చూడాలి తప్ప బ్యాన్ చేయకూడదు అని గతంలో తెగేసి చెప్పిందని గుర్తు చేస్తున్నారు..

సర్టిఫికేషన్ తో హెచ్చరిక..

ఇటీవల 'ధురంధర్' వంటి హింసాత్మక అంశాలున్న చిత్రాల సర్టిఫికేషన్, మార్పులపై కూడా చర్చ జరుగుతోంది. ఈ సినిమాకు మన దేశంలో కత్తెర్లు పడితే, బ్రిటన్ (BBFC) లో కేవలం కంటెంట్ వార్నింగ్‌లతో 'A' సర్టిఫికేట్ ఇచ్చి వదిలేశారు. వయోజనులైన ప్రేక్షకులు ఏం చూడాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ వారికే ఇవ్వాలి. సర్టిఫికేషన్ అనేది హెచ్చరికగా ఉండాలి తప్ప, సెన్సార్‌షిప్ పేరిట సినిమా ఆత్మను చంపేసేలా ఉండకూడదని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. బ్రిటన్ వంటి విధానాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని నొక్కి చెబుతున్నారు.

OTT యుగంలో సెన్సార్ అవసరమా?

భారత్‌లో డిజిటల్ వినియోగం విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రేక్షకులకు అనేక రకాల అంతర్జాతీయ కంటెంట్ అందుబాటులో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్లలో మాత్రమే కఠినమైన కత్తిరింపులు విధించడం పోటీపై ప్రభావం చూపవచ్చని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సుప్రీంకోర్టు కూడా ఎస్. రంగరాజన్ వర్సెస్ పి. జగ్జీవన్ రామ్ కేసులో భావప్రకటనా స్వేచ్ఛపై ఆంక్షలకు సమీపమైన, ప్రత్యక్షమైన ప్రమాదం వంటి బలమైన కారణాలు అవసరమని స్పష్టం చేసింది.

సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేయాలి.. కొన్నిసార్లు అసౌకర్యానికి గురిచేయాలి కూడా. పెద్దలకు ఉద్దేశించిన చిత్రాలకు తగిన వయోపరిమితి, స్పష్టమైన హెచ్చరికలు ఇవ్వడం ఒక మార్గమైతే, కథను మార్చేలా ఒత్తిడి చేయడం మరో మార్గం. ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందన్నదన్న ప్రధాన వాదన సినీ పరిశ్రమలో వినిపిస్తోంది. వయోజనులైన ప్రేక్షకులు ఏం చూడాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ వారికే ఇవ్వాలి. సర్టిఫికేషన్ అనేది హెచ్చరికగా ఉండాలి తప్ప, సెన్సార్‌షిప్ పేరిట సినిమా కథను చంపేసేలా ఉండకూదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.