చండీగఢ్: డ్రగ్స్ అమ్మకాలపై ప్రశ్నించిన యాంటీ డ్రగ్ యాక్టివిస్ట్ పర్వీందర్ సింగ్ ఝోటాను మెడికల్ షాప్ ఓనర్ కాల్చి చంపాడు. పంజాబ్లోని మాన్సాలో మంగళవారం జరిగిన ఈ ఘటన ఫేస్బుక్ లైవ్లో రికార్డవడంతో కలకలం రేపింది. కాల్పుల్లో ఝోటాతో పాటు మరో నలుగురికి గాయాలయ్యాయి. మెడికల్ షాపుల్లో అక్రమ డ్రగ్స్ అమ్మకాలను బయటపెట్టే ఝోటా.. ఓ మెడికల్ స్టోర్ బయట లైవ్ చేస్తూ, డ్రగ్స్ అమ్మకాలపై ఓ వృద్ధుడితో కలిసి ఓనర్ను నిలదీశారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. చేతిలో పిస్టల్ ఉన్నా ఝోటా వెనక్కి తగ్గకుండా ‘నన్ను చంపు’ అంటూ సవాల్ చేశారు.
నాలుగు నిమిషాల తర్వాత ఓనర్ కాల్పులు జరపడంతో ఝోటా కుప్పకూలిపోయారు. క్షతగాత్రులను మాన్సా సివిల్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఝోటా చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఆయన శరీరంలో 3 బుల్లెట్లు దిగాయని, కాలేయానికి గాయం కావడంతో మృతి చెందినట్లు డాక్టర్ గుర్మైల్ సింగ్ తెలిపారు. మిగతా నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. నిందితుడు పరారీలో ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ హత్యపై బీజేపీ, కాంగ్రెస్, శిరోమణి అకాలీ దళ్ నేతలు సీఎం భగవంత్ మాన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. డ్రగ్స్ అక్రమ వ్యాపారాన్ని బయటపెడుతున్నందుకే ఝోటాను హత్య చేశారని అకాలీ దళ్ నేత విక్రమ్ సింగ్ ఆరోపించారు.
