జెండా ఊపి భారత్ మాతా కీ జై అంటే జైలుకా?.. ప్రధాని మోదీ, అమిత్ షాపై సీజేపీనేత ఫైర్

జెండా ఊపి భారత్ మాతా కీ జై  అంటే జైలుకా?.. ప్రధాని మోదీ, అమిత్ షాపై సీజేపీనేత ఫైర్

ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలపై కాక్రోచ్ జనతా పార్టీ నేత అజింక్య షిండే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జాతీయ జెండా ఊపి భారత్  మాతాకీ జై అన్నందుకు జైలుకు పంపుతున్నారని విమర్శించారు. సీఈసీ జ్ణానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ నిరసన  సందర్భంగా జాతీయ జెండా ఊపుతూ  భారత్ మాతాకీ జై అని నినాదాలు చేసినందుకు సీజేపీ నేతలు అశుతోష్, సౌరవ్ దాస్ లను అరెస్ట్ చేసి ఐదు రోజుల పాటు కస్టడీకి పంపడం ద్వారా ప్రాథమిక హక్కులను మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు.
 
అశుతోష్, సౌరవ్ దాస్ ల అరెస్ట్ పై అజింక్యా షెండే మీడియాతో మాట్లాడుతూ..  జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో అశుతోష్, సౌరవ్ దాస్‌తో పాటు తాను, సీజేపీ కార్యకర్తలు పాల్గొన్నామని అజింక్య షిండే తెలిపారు. అక్కడ జాతీయ జెండాను ప్రదర్శిస్తూ ‘భారత్ మాతా కీ జై’ అని నినాదాలు మాత్రమే చేశామని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి తమ ఇద్దరు నేతలకు ఐదు రోజుల జైలు శిక్ష విధించారని ఆరోపించారు.

అశుతోష్ పుట్టినరోజు నాడే అతడిని జైలుకు పంపారని షిండే అన్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటూ అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడేందుకు దేశ ప్రజలంతా ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

తమ నేతలను జైలుకు పంపినంత మాత్రాన సీజేపీ కార్యకర్తలు భయపడరని స్పష్టం చేశారు. అశుతోష్, సౌరవ్ దాస్ ధైర్యంగా జైలుకు వెళ్తున్నారని, ప్రభుత్వ చర్యలకు తలొగ్గబోమని అజింక్య షిండే స్పష్టం చేశారు.