దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటి బ్యాంక్ ఆఫ్ బరోడా. ప్రస్తుతం ఈ బ్యాంకు చుట్టూ కోర్టు కేసులు, భారీ నష్టపరిహారాల వివాదం నడుస్తోంది. ఎన్ఎంసీ హెల్త్‌కేర్ (NMC Healthcare), యూఏఈ ఎక్స్ఛేంజ్ వంటి సంస్థల వ్యవస్థాపకుడైన ప్రముఖ వ్యాపారవేత్త బీఆర్ శెట్టి.. బాంబే హైకోర్టులో బ్యాంక్ ఆఫ్ బరోడాపై ఏకంగా రూ.లక్షా 45వేల కోట్లు భారీ నష్టపరిహారం దావా వేశారు. ఈ పరిణామం ఒక్కసారిగా స్టాక్ మార్కెట్లతో పాటు బ్యాంకింగ్ రంగంలోనూ కలకలం సృష్టించింది.
ఈ వివాదం ముదిరిన నేపథ్యంలో బుధవారం ఉదయం ట్రేడింగ్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లు సుమారు 3 శాతం మేర పడిపోయాయి. దీంతో నిఫ్టీ 100 ఇండెక్స్‌లో ఈ షేరు టాప్ లూజర్‌గా నిలవాల్సి వచ్చింది. వ్యాపారవేత్త బీఆర్ శెట్టి తన గ్రూప్ కంపెనీల ఆర్థిక లావాదేవీల మోసంలో బ్యాంక్ పాత్ర ఉందని ప్రధాన ఆరోపిస్తున్నారు. ప్రత్యక్ష నష్టాలు, కోల్పోయిన వ్యాపార అవకాశాలు, ప్రతిష్టకు భంగం వాటిల్లిందనే కారణాలతో ఒక్కో అంశానికి 5 బిలియన్ డాలర్ల చొప్పున మొత్తం 15 బిలియన్ డాలర్లను నష్టపరిహారంగా కోరారు. అంతేకాకుండా ఈ మొత్తంపై సంవత్సరానికి 18 శాతం వడ్డీ కూడా చెల్లించాలని తన పిటిషన్లో పేర్కొన్నారు బీఆర్ శెట్టి.
తప్పుడు సప్లయర్ అకౌంట్ల ద్వారా నిధులు మళ్లించబడ్డాయని, మనీలాండరింగ్ హెచ్చరికలను బ్యాంకు పట్టించుకోలేదని, అనధికారిక లావాదేవీలకు అనుమతి ఇచ్చిందని శెట్టి ఆరోపించారు. అంతేకాకుండా తన పేరుపై లోన్స్ తీసుకునేందుకు నకిలీ సంతకాలతో కూడిన వ్యక్తిగత గ్యారెంటీలను ఉపయోగించారని పిటిషన్లో ఆరోపణలు గుప్పించారు. తన బ్యాంకింగ్ రికార్డులను, అంతర్గత కంప్లయన్స్ డాక్యుమెంట్లను బహిర్గతం చేయాలని కోరారు.
ఈ ఆరోపణలను బ్యాంక్ ఆఫ్ బరోడా తీవ్రంగా ఖండించింది. తమకు ఇంకా కోర్టు నుంచి ఎలాంటి అధికారిక నోటీసులు, సమన్లు అందలేదని స్పష్టం చేసింది. ఒకవేళ నోటీసులు అందితే చట్టపరంగా బ్యాంకు ప్రయోజనాలను కాపాడుకోవడానికి అత్యంత ధృడంగా పోరాడుతామని తెలిపింది. గతంలో ఎన్ఎంసీ గ్రూప్ కంపెనీల సంయుక్త నిర్వాహకులతో జరిగిన వ్యాపార వివాదాలను పరిష్కరించుకోవడానికి తాము రూ.5వేల 700 కోట్లు చెల్లించి సెటిల్మెంట్ చేసుకున్నామని గుర్తుచేసింది. అయితే ఆ సెటిల్మెంట్లో తాము ఎలాంటి తప్పు చేసినట్లు అంగీకరించలేదని కూడా స్పష్టం చేసింది.
ALSO READ : ట్రంప్ నా అధ్యక్షుడు.. నా భర్త
అంతేకాకుండా బీఆర్ శెట్టి తమ బ్యాంకుకు దాదాపు రూ.2వేల 800 కోట్లు బకాయిపడ్డారని, ఆ బకాయిలను రాబట్టడానికి తాము ఇండియా, యూఏఈలోనూ న్యాయపోరాటం చేస్తున్నామని బ్యాంక్ వెల్లడించింది. ఆయన ఆస్తులను విక్రయించకుండా కర్ణాటక హైకోర్టు గతంలోనే ఆంక్షలు విధించిందని, ఆ తర్వాత ఆయన నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT) ముందు దివాలా పిటిషన్ దాఖలు చేశారని పేర్కొంది. న్యూయార్క్ కోర్టులో శెట్టి వేసిన ఇలాంటిదే మరో దావా గతంలోనే కొట్టివేయబడిందని బ్యాంక్ గుర్తుచేసింది.
ప్రస్తుతం శెట్టి చేస్తున్న ఈ 15 బిలియన్ డాలర్ల దావా అనేది కేవలం ఆయన చేస్తున్న డిమాండ్ మాత్రమేనని, అంతేకానీ బ్యాంకుపై పడిన నిరూపితమైన బాధ్యత కాదని బ్యాంక్ స్పష్టం చేసింది. తాను ఈ సెటిల్మెంట్లో భాగస్వామి కాదని, తన ప్రత్యేక వాదనలను ఇది ప్రభావితం చేయదని శెట్టి వాదిస్తున్నారు. ఈ మొత్తం పరిణామాల మధ్య బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లు క్షీణించడం, మార్కెట్లో ఈ వార్త చర్చనీయాంశంగా మారడం దుమారం రేపుతోంది. రాబోయే రోజుల్లో ఈ వివాదం కోర్టులో ఎలాంటి మలుపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.
