డబ్బు హవాలాలో IAS ఆఫీసర్ కొడుకు.. IDFC బ్యాంక్ స్కామ్‌లో కొత్త ట్విస్ట్

డబ్బు హవాలాలో IAS ఆఫీసర్ కొడుకు.. IDFC బ్యాంక్ స్కామ్‌లో కొత్త ట్విస్ట్

హర్యానాలో సంచలనం సృష్టించిన రూ.504 కోట్ల IDFC ఫస్ట్ బ్యాంక్ కుంభకోణంలో దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసులో సస్పెన్షన్‌కు గురైన హర్యానా ఐఏఎస్ అధికారి రామ్ కుమార్ సింగ్ కొడుకు ప్రశాంత్‌కు హవాలా మార్గంలో డబ్బు చేరవేసిన వ్యవహారంలో చండీగఢ్‌కు చెందిన వ్యాపారవేత్త మోహిత్ గోయల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కుంభకోణంలో ఐఏఎస్ అధికారుల ప్రమేయం, వారి కుటుంబ సభ్యులకు ముట్టిన అక్రమ సొమ్ము గురించి బయటకు రావటం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది.

ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ సెక్టార్ 32 బ్రాంచ్ మాజీ మేనేజర్, ఈ కుంభకోణానికి సూత్రధారిగా భావిస్తున్న రిభవ్ రిషి ఆదేశాల మేరకు మోహిత్ గోయల్ జనవరి 22, 2026న రూ.2 కోట్ల నగదును సమకూర్చాడని సీబీఐ పేర్కొంది. ఈ మొత్తాన్ని హవాలా నెట్‌వర్క్ ద్వారా ఢిల్లీలో ఉన్న ఐఏఎస్ అధికారి రామ్ కుమార్ సింగ్ కుమారుడు ప్రశాంత్‌కు అదే రోజు సాయంత్రం అందజేశారు. కల్కా మున్సిపల్ కౌన్సిల్‌కు చెందిన రూ.18.46 కోట్ల ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టగా.. అందులోంచే ఈ నగదు కేటాయించబడినట్లు సీబీఐ గుర్తించింది. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగమైన కేవలం 48 గంటల్లోపే ఆ సొమ్ము హవాలా రూపంలో నేరుగా ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకు చేతికి చేరడం గమనార్హం.

ఈ హవాలా లావాదేవీల కోసం నేరగాళ్లు పకడ్బందీ ప్లాన్ అమలు చేశారు. పది రూపాయల నోటుపై ఉన్న సీరియల్ నంబర్‌ను కోడ్‌గా ఉపయోగించి ఢిల్లీలోని చాందినీ చౌక్ ప్రాంతంలో విడతలవారీగా రూ. కోటి, రూ. 50 లక్షలు, మరో రూ.50 లక్షల చొప్పున క్యాష్ తరలించారు. దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్లు, కాల్ రికార్డులు, టవర్ డేటాను సీబీఐ పక్కా ఆధారాలుగా సేకరించింది. మోహిత్ గోయల్‌కు చెందిన సంస్థల ద్వారా రూ.59.50 కోట్లు చేతులు మారగా, అందులో దాదాపు రూ. 45.45 కోట్లు తిరిగి నగదు రూపంలోనే వెనక్కి వెళ్లినట్లు తేలింది. ఈ సొమ్ముతో బంగారు ఆభరణాలు కొన్నట్లు దర్యాప్తులో తేలింది.

ఈ మొత్తం కుంభకోణానికి కేంద్ర బిందువుగా నిలిచిన ఐఏఎస్ అధికారి రామ్ కుమార్ సింగ్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ నిబంధనలను ఉల్లఘించి నిధుల బదిలీకి అక్రమంగా అనుమతులు ఇచ్చారని తేలింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఆయనను సీబీఐ జూన్ 18, 2026న అరెస్ట్ చేసింది. ఆయనతో పాటు మరో నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులపై విచారణకు కూడా సీబీఐ అనుమతి కోరింది. ప్రభుత్వ నిధులను కొల్లగొట్టడంలో బ్యాంక్ అధికారులు, వ్యాపారవేత్తలు, సీనియర్ బ్యూరోక్రాట్లు కలిసి పక్కా సిండికేట్‌గా ఏర్పడి ఎలా దోచుకున్నారనే విషయాలను తాజా ఘటన బట్టబయలైంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక సీబీఐ కోర్టులో విచారణ కొనసాగుతోంది.