మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల మధ్య నీటి వివాదాలు సృష్టించడం సరికాదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రాంతీయ విభేదాలకు తావు ఇవ్వకూడదన్నారు. రెండు జిల్లాల రైతులకు ప్రయోజనం కలిగేలా సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగంగా పూర్తి చేయాలని గుత్తా కోరారు.
ఎదుళ్ల రిజర్వాయర్ నుంచి పాలమూరు ప్రాంతానికి రోజుకు 1.5 టీఎంసీలు, డిండి ఎత్తిపోతల పథకానికి 0.5 టీఎంసీల నీటిని కేటాయించే అంశంపై అనవసర వివాదాలు సృష్టించవద్దని గుత్తా సూచించారు. నీటి కేటాయింపులపై సామరస్యపూర్వక నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. ఈ సమస్య పరిష్కారానికి రెండు జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించాలని అభిప్రాయపడ్డారు.
పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల పనులను వేగవంతం చేయాలని అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఇంజనీర్లు రాజకీయ, ప్రాంతీయ వివాదాలకు అతీతంగా వ్యవహరించాలని సూచించారు.
ఫ్లోరైడ్ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొన్న నల్గొండ జిల్లాకు సురక్షిత తాగునీటితో పాటు సాగునీటి వసతులు కూడా అవసరమని గుత్తా చెప్పారు. రెండు జిల్లాల రైతులకు మేలు జరిగేలా ప్రాజెక్టుల పనులను పూర్తి చేయాలని కోరారు.
నీటిని పొదుపుగా వాడుకోవాలి
రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గుతున్న క్రమంలో నీరు, విద్యుత్ను పొదుపుగా వాడుకోవాలని సూచించారు. నీటి నిల్వలు తగ్గితే జలవిద్యుత్ ఉత్పత్తిపైనా ప్రభావం పడుతుందని తెలిపారు. రబీ సీజన్లో అధిక నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా ఆరుతడి పంటల సాగుపై రైతులు దృష్టి పెట్టాలన్నారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.జిల్లాల మధ్య వివాదాల కంటే చర్చలు, సమన్వయంతో సమస్యలకు పరిష్కారం ముఖ్యమని గుత్తా సుఖేందర్రెడ్డి స్పష్టం చేశారు.
