మోస్ట్ డేంజరస్ దేశాలు ఇవే.. ప్రపంచంలో అత్యధిక క్రైం దేశం ఏదో తెలుసా..?

మోస్ట్ డేంజరస్ దేశాలు ఇవే.. ప్రపంచంలో అత్యధిక క్రైం దేశం ఏదో తెలుసా..?

ప్రపంచవ్యాప్తంగా నేరాలు, హత్యలు, దోపిడీలు, గ్యాంగ్‌స్టర్ల ఆగడాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్ని దేశాల్లో దొంగతనాలు, దోపిడీలు, హత్యలు ఎక్కువగా నమోదవుతుండగా.. మరికొన్ని దేశాల్లో రాజకీయ అస్థిరత, పేదరికం, బలహీనమైన పోలీసు వ్యవస్థ ప్రజల భద్రతకు సవాలుగా మారుతున్నాయి. ఈ క్రమంలో నంబియో విడుదల చేసిన 2026 మిడ్‌ ఇయర్‌ క్రైం ఇండెక్స్‌లో మొదటి దేశం, టాప్‌ 10లో ఉన్న దేశాలేవి? అక్కడ నేరాలు పెరగడానికి కారణాలేంటో తెలుసుకుందాం.

ప్రపంచవ్యాప్తంగా నేరాలు, హింసాత్మక ఘటనలు, గ్యాంగ్‌ స్టర్ల ఆగడాలు ప్రజల్లో భయాన్ని పెంచుతున్నాయి.  దీంతో విదేశాలకు వెళ్లాలనుకునే పర్యాటకులు ఆయా దేశాల భద్రతా పరిస్థితులపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు.

ప్రపంచంలో అత్యధిక క్రైమ్ ఉన్న దేశం..?

నంబియో (Numbeo) విడుదల చేసిన 2026 మిడ్‌ ఇయర్‌ క్రైమ్ ఇండెక్స్ ప్రకారం, పాపువా న్యూ గినియా 80.8 స్కోరుతో మొదటి స్థానంలో ఉంది. వెనిజులా 80.5 స్కోరుతో రెండో స్థానంలో, హైతీ 79.8 స్కోరుతో మూడో స్థానంలో ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా కూడా అధిక క్రైమ్ ఇండెక్స్ ఉన్న దేశాల జాబితాలో ఉన్నాయి.

ఈ దేశాల్లో నేరాలు ఎందుకు ఎక్కువ?

పాపువా న్యూ గినియాలో పేదరికం, నిరుద్యోగం, స్థానిక ఘర్షణలు నేరాలకు కారణమవుతున్నాయి. వెనిజులాలో ఆర్థిక సమస్యలు, వ్యవస్థీకృత నేరాలు ప్రజల భద్రతపై ప్రభావం చూపుతున్నాయి. హైతీలో సాయుధ ముఠాల హింస, కిడ్నాప్‌లు, దోపిడీలు ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో భద్రతాపరమైన సవాళ్లు కొనసాగుతుండగా, దక్షిణాఫ్రికాలో హత్యలు, దోపిడీలు, ముఠా ఘర్షణలు ఆందోళన కలిగిస్తున్నాయి.

ఈ జాబితాలో హోండురాస్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, సిరియా, జమైకా, గయానా వంటి దేశాలు కూడా ఉన్నాయి.

అయితే, నంబియో క్రైమ్ ఇండెక్స్ ప్రజల అభిప్రాయాలు, భద్రతపై వారి భావనల ఆధారంగా రూపొందుతుంది. ఇది ప్రభుత్వాలు నమోదు చేసిన నేరాల గణాంకాలకు సమానం కాదు. అందువల్ల ప్రయాణానికి ముందు అధికారిక ట్రావెల్ అడ్వైజరీలను పరిశీలించడం ముఖ్యమంటున్నారు నిపుణులు.