తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. యువ పారిశ్రామికవేత్తలకు సీఎం ఆహ్వానం

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. యువ పారిశ్రామికవేత్తలకు సీఎం ఆహ్వానం

హైదరాబాద్‌: తెలంగాణను పెట్టుబడులకు, పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని  సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో యువ పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యువత ఇతరుల కంపెనీల్లో ఉద్యోగాలు చేయడానికే పరిమితం కాకుండా.. సొంత సంస్థలను స్థాపించి మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని సూచించారు. హైటెక్ సిటీలో సమైక్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన బిజినెస్ సమ్మిట్‌కు సీఎం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

తెలంగాణను 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సీఎం తెలిపారు. దేశ జనాభాలో తెలంగాణ వాటా 2.5 శాతంగా ఉన్నప్పటికీ, దేశ జీడీపీలో రాష్ట్రం ఐదు శాతం వాటాను కలిగి ఉందని పేర్కొన్నారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచడమే లక్ష్యమన్నారు.

ఈ లక్ష్యాలను సాధించేందుకు సేవారంగం, తయారీ రంగం, వ్యవసాయ రంగాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురావడంతో పాటు వాటిని ఆచరణలోకి తీసుకెళ్లేందుకు పక్కా కార్యాచరణ అవసరమని స్పష్టం చేశారు. విక్షిత్ భారత్‌ 2047 లక్ష్య సాధనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలని అభిప్రాయపడ్డారు. 2047 నాటికి భారత్‌ను 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్ది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అగ్రస్థానానికి తీసుకెళ్లాలన్న లక్ష్యాన్ని ప్రస్తావించారు.

ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఐటీ, ఫార్మా, విద్యాసంస్థలు, సర్వీస్ సెక్టార్‌తో హైదరాబాద్‌ ఇప్పటికే నాలెడ్జ్ హబ్‌గా ఎదిగిందని పేర్కొన్నారు. నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు పరిశ్రమలను నగరం వెలుపలకు తరలించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు ముందుకొచ్చే పరిశ్రమలకు అవసరమైన ప్రోత్సాహకాలు, అనుమతులు, ఇతర సహకారం అందించే విధానాన్ని రూపొందించాలనే ఆలోచన ఉందన్నారు.

ఔటర్ రింగ్ రోడ్‌తో హైదరాబాద్‌ అభివృద్ధికి కొత్త దిశ ఏర్పడిందని, రీజినల్ రింగ్ రోడ్‌తో పారిశ్రామిక రంగానికి మరింత ఊతం లభిస్తుందని తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగంలో 160 కిలోమీటర్ల మేర పనులకు ఇప్పటికే టెండర్లు పిలిచినట్లు వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్ వెలుపల తయారీ రంగాన్ని ప్రోత్సహించేలా చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు.

యువ పారిశ్రామికవేత్తలకు భూములు, అనుమతులు, ప్రోత్సాహకాలు అందించేందుకు సమగ్ర విధానం అవసరమని సీఎం పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఆహ్వానించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన విధానాలు కొనసాగుతాయని, గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన మంచి పారిశ్రామిక విధానాలను కొనసాగిస్తామని తెలిపారు. పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి కల్పన విషయంలో రాజకీయాలకు అతీతంగా నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

స్టార్టప్‌లను ప్రోత్సహించడం ద్వారా యువతలోని ఆవిష్కరణలు, వ్యాపార ఆలోచనలకు ప్రోత్సాహం లభిస్తుందని సీఎం అన్నారు. యువత సొంత కంపెనీలను స్థాపించి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సూచించారు. ఉద్యోగాల కోసం ఎదురుచూడటమే కాకుండా, ఇతరులకు ఉద్యోగాలు కల్పించే దిశగా ఆలోచించాలని పిలుపునిచ్చారు.

వ్యక్తిగత విజయాల కంటే సమష్టి కృషితో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కమ్యూనిటీలతో అనుసంధానమై పనిచేసినప్పుడు వ్యక్తుల సామర్థ్యానికి సమష్టి బలం తోడవుతుందని తెలిపారు. యువతకు కొత్త అవకాశాలను అందించడంలో సమైక్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ వంటి వేదికలు కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.

దేశ ఆర్థికాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం కీలకమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంతో పాటు వారి ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణలో స్వయం సహాయక సంఘాల్లో 67 లక్షల మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. గత మూడేళ్లలో మహిళా సంఘాలకు రూ.61 వేల కోట్ల బ్యాంకు లింకేజీ కల్పించినట్లు వెల్లడించారు. మహిళా సంఘాల ద్వారా 1,000 బస్సులను ఆర్టీసీకి లీజుకు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. అలాగే మహిళలకు 1,000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి అవకాశాలు కల్పించడంతో పాటు పెట్రోల్ బంకుల నిర్వహణలోనూ భాగస్వాములను చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు.

హైటెక్ సిటీ సమీపంలో 3.5 ఎకరాల్లో ఇందిరా మహిళా శక్తి బజార్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం దీని ప్రధాన ఉద్దేశమన్నారు. సమైక్య ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లోనూ మహిళలు, యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

కొత్త తరానికి స్ఫూర్తినిచ్చేలా వివిధ రంగాల్లో విజయాలు సాధించిన ప్రముఖుల జీవిత విశేషాలను యువతకు పరిచయం చేయాలని సీఎం సూచించారు. రాజకీయాలు, సినిమా, వ్యాపారం, పరిపాలన, న్యాయ రంగాల్లో రాణించిన వారి విజయ ప్రస్థానాలను యువతకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. వారి అనుభవాలు, ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాలు యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

సమైక్య ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను ప్రారంభించడంపై నిర్వాహకులను అభినందించారు. యువతను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఇలాంటి వేదికలు దోహదపడతాయని తెలిపారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉంటాయని, మిగిలిన సమయంలో రాష్ట్రం, దేశ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని అన్నారు.

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు యువ పారిశ్రామికవేత్తలు తమ ప్రతిపాదనలతో ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. పరిశ్రమల స్థాపన, స్టార్టప్‌ల అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన ద్వారా రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో భాగస్వాములు కావాలని కోరారు.

యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కొనసాగించడం ద్వారా తెలంగాణ అభివృద్ధి లక్ష్యాలను సాధించవచ్చని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్‌ 2047లో ప్రతి పారిశ్రామికవేత్త భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.