ఉచిత విద్యుత్పై చేతులెత్తేసే కుట్ర  : మాజీ మంత్రి హరీశ్ రావు

ఉచిత విద్యుత్పై చేతులెత్తేసే కుట్ర  : మాజీ మంత్రి హరీశ్ రావు
  • అభ్యంతరాలను లెక్క చేయకుండా రైతు డిస్కమ్​ ఏర్పాటుకు సర్కార్ జీవో 
  • మాజీ మంత్రి హరీశ్ రావు

హైదరాబాద్, వెలుగు: రైతు డిస్కమ్ ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేయడం కాంగ్రెస్​ప్రభుత్వ నియంతృత్వ వైఖరికి నిదర్శనమని మాజీ మంత్రి, బీఆర్ఎస్​డిప్యూటీ ఫ్లోర్​లీడర్​హరీశ్​రావు అన్నారు. రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, విద్యుత్​ రంగ నిపుణులు, రైతులు లేవనెత్తిన అభ్యంతరాలను లెక్క చేయకుండా జీవో 17ను తేవడం దారుణమని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ పై చేతులెత్తేసి, రైతుల మెడకు ఉరివేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు.

వ్యవసాయం, ఇండ్లు, పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా చేయలేకపోతున్న సర్కారు.. ఇప్పుడు రైతు డిస్కమ్ పేరుతో మరో డ్రామాకు తెరతీసిందన్నారు. ఈ డిస్కమ్ వల్ల రైతులకు ఒరిగే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. ట్రాన్స్ ఫార్మర్స్ కాలిపోతే ఇప్పటికే దిక్కులేదని, రేపు రైతు డిస్కమ్​తో మరిన్ని ఇబ్బందులు వస్తాయన్నారు.

రైతు డిస్కమ్ పరిధిలోకి 30,60,861 వ్యవసాయ కనెక్షన్లు, 512 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు, హైదరాబాద్​వాటర్ సప్లై బోర్డు, మిషన్​భగీరథ సహా మొత్తం 30,62,853 కనెక్షన్లను తెచ్చారన్నారు. ఇంత భారీ వ్యవస్థ నిర్వహణ కేవలం 2 వేల మంది సిబ్బందితో ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.  

కేంద్రీకృత పీఎంయూ టెండర్లు రద్దు చేయాలె

గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో నిత్యావసర సరుకుల సరఫరాకు సంబంధించి కేంద్రీకృత పీఎంయూ టెండర్లను రద్దు చేయాలని హరీశ్​రావు డిమాండ్​చేశారు. తెలంగాణ గురుకుల కాంట్రాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం ఆయనను హైదరాబాద్​లోని నివాసానికి వెళ్లి కలిశారు. ప్రభుత్వం మార్చిన టెండర్ నిబంధనల వల్ల వేలాది మంది స్థానిక వెండర్ల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అనంతరం హరీశ్ రావు మాట్లాడుతూ.. రూ.800 కోట్ల టెండర్లలో ప్రభుత్వం కమీషన్ల​దందా నడుపుతోందని ఫైర్​అయ్యారు. రాష్ట్రాన్ని ఒకే యూనిట్‌‌‌‌గా చేసి పీఎంయూ విధానం ద్వారా కాంట్రాక్టును ఒకే వ్యక్తికి, అదీ గతంలో బ్లాక్‌‌‌‌లిస్టులో పెట్టిన సంస్థకు అప్పగించడం వెనుక భారీగా ముడుపులు చేతులు మారాయని ఆరోపించారు.