- ఓట్ల చోరీ నుంచి రాజ్యాంగ వ్యవస్థల నిర్వీర్యం వరకు నిర్లక్ష్యం
హుస్నాబాద్, వెలుగు: దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ఓటర్ల జాబితాల్లో అక్రమాలు మొదలుకొని రాజ్యాంగ వ్యవస్థల నిర్వీర్యం వరకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి విమర్శించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అనభేరి-సింగిరెడ్డి అమరుల భవన్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు.
‘సర్’ పేరుతో ఓటర్ల జాబితాల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎన్నికల కమిషన్లో ఇద్దరు సభ్యులు వ్యతిరేకించినా సంబంధిత అంశాలను పట్టించుకోకపోవడం ఆందోళనకరమన్నారు. ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్పై విమర్శలు వస్తున్నా కేంద్రం స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో నిరసనకారులపై అణచివేత ధోరణి సరికాదన్నారు. దేశంలో ఇన్ని పరిణామాలు జరుగుతున్నా ప్రధాని మోదీ మౌనంగా ఉండటం నీరో చక్రవర్తి వైఖరిని తలపిస్తోందని విమర్శించారు. గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై చాడ ఆందోళన వ్యక్తం చేశారు.
2004లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గౌరవెల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయించానని, రెండు దశాబ్దాలు దాటినా ప్రాజెక్టులు పూర్తికాకపోవడం శోచనీయమన్నారు. మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం హుస్నాబాద్ ప్రాంతంలోని ప్రాజెక్టుల విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేసిందని ప్రశ్నించారు.
గండిపల్లి ప్రాజెక్టు పనులు 40 శాతమే పూర్తయ్యాయని, సీఎం రేవంత్రెడ్డి గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను త్వరగ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల అభీష్టం మేరకు, పరిపాలనా సౌలభ్యం కోసం హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాలను కరీంనగర్ జిల్లాలో కొనసాగించాలని కోరారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపైనా ఆయన స్పందింస్తూ ఎంప్లాయీస్ యూనియన్ సుదీర్ఘకాలంగా కార్మికుల హక్కుల కోసం పోరాడుతోందన్నారు.
