వైవాహిక జీవితంలో జోక్యం..  చైతన్య గురూజీపై కేసు నమోదు!

వైవాహిక జీవితంలో జోక్యం..  చైతన్య గురూజీపై కేసు నమోదు!

జూబ్లీహిల్స్, వెలుగు : వైవాహిక జీవితంలో జోక్యం చేసుకుంటున్నారని ప్రశ్నించినందుకు చంపేస్తానని బెదిరించారంటూ ఓ సాఫ్ట్‌‌వేర్ ఇంజనీర్ పోలీసులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు ఆధారంగా చైతన్య గురూజీ అలియాస్ మైరెడ్డి సునీల్ రెడ్డిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్‌‌లోని శ్రావంతి నగర్‌‌కు చెందిన కె. విష్ణుదీప్ రెడ్డి (36) సాఫ్ట్‌‌వేర్ ఇంజినీర్​..ఇతడి భార్యకు చైతన్య గురూజీతో ఆధ్యాత్మిక కార్యకలాపాల సందర్భంగా పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఫోన్​లో మాట్లాడుకోవడంతో పాటు మెసేజ్​లు చేసుకునేవారు.

ఈ విషయం తెలిసిన విష్ణు..జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 71లో ఉన్న గురూజీ దగ్గరకు వెళ్లి ప్రశ్నించారు. దీంతో మళ్లీ సంప్రదిస్తే జీవితాన్ని నాశనం చేస్తానని, చంపేస్తానని బెదిరించినట్లు బాధితుడు ఆరోపించారు. వెంటనే పోలీస్​స్టేషన్​కు వెళ్లలేదని, గురూజీ పై  కేసు నమోదు చేసేందుకు కోర్టు నుంచి అనుమతి తెచ్చుకుని అక్టోబర్ 12న జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపాడు. గురూజీ తన భార్యతో చేసిన చాటింగ్, ఆడియో , మరికొన్ని ఆధారాలను పోలీసులకు 
అందజేశానని చెప్పాడు.