న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పద్మ అవార్డుల రూపంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్లకు (సీఈసీ) లంచాలు ఇచ్చిందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్కు అనుకూలంగా వ్యవహరించిన ఎలక్షన్ ఆఫీసర్లకు పద్మ అవార్డులు, రాజకీయ నియామకాలు, మంత్రి పదవుల రూపంలో బహుమతులు ఇచ్చిందని ఆరోపించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
‘‘కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషనర్ల పదవిని ఎంతలా దిగజార్చిందో తెలుసా! మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎం.ఎస్. గిల్ పదవిలో కొనసాగుతున్న టైంలోనే ఆయనకు దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మ విభూషణ్’ ఇచ్చారు. ఇది ఒక రకమైన లంచం కాదా? ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా పదవులు పొందారు. అలాగే, 1985 డిసెంబర్ 31న ప్రధాన ఎన్నికల కమిషనర్గా పదవీ విరమణ చేసిన టీఎన్ శేషన్ను రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1986 ఫిబ్రవరి 26న గుజరాత్ గవర్నర్గా నియమించింది.
2005లో ఎలాంటి ప్రభుత్వ పదవిలో లేని సోనియా గాంధీ నవీన్ చావ్లాను ఎన్నికల కమిషనర్గా నియామించారు. చావ్లా ప్రవర్తన కాంగ్రెస్కు అనుకూలంగా ఉందని ఆరోపణలు వచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మీరు మాకు ఎన్నికల్లో సహాయం చేయండి.. మేము మీకు వెంటనే ఒక పదవి ఇస్తామనే ఒప్పందం కాంగ్రెస్ హయాంలో నడిచింది. అందులో భాగంగానే ఎన్నికల అధికారులకు గవర్నర్ పదవులు, మంత్రి పదవులు, పార్టీ పదవులు, ఎన్నికల టిక్కెట్లతో బహుమతులు అందజేశారు.
నిష్పక్షపాతంగా పనిచేసే ఎన్నికల సంఘం సామర్థ్యాన్ని ఇలా ఎన్నోసార్లు కాంగ్రెస్ దెబ్బతీసింది. తమ హయాంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన కాంగ్రెస్కు నేడు ఎన్నికల సంఘం పనితీరుపై విమర్శలు చేసే నైతిక హక్కు లేదు’’ అని పీయూష్ గోయల్ మండిపడ్డారు.
