కోల్కతా: పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ పైకి ఓ మహిళ చేతిలో కత్తి పట్టుకుని దూసుకెళ్లే ప్రయత్నం చేసింది. వెంటనే అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది, స్థానికులు మహిళను అడ్డుకుని పోలీసులకు అప్పగించారు.
పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం.. కోల్కతా కాళీఘాట్లో ఉన్న మమత ఇంటి సమీపంలో దుర్గామాత మండపం ఏర్పాటు చేశారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఆమె దుర్గామాతకు పూజ చేసేందుకు వెళ్లారు. ఆ సమయంలో మత్తులో ఉన్న ఓ మహిళ చేతిలో కత్తితో హల్చల్ చేసింది. బూతులు తిడుతూ నేరుగా మమత వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించింది. తాను ఆమె మేనకోడలినని అరుస్తూ రోడ్డుపై పడుకుని పెద్ద హంగామా సృష్టించింది.
జెడ్-ప్లస్ భద్రత ఉన్న మాజీ సీఎం నివాస ప్రాంతంలో ఈ ఘటన జరగడం తీవ్ర కలకలం రేపింది. ఇది భద్రతా వైఫల్యమని, దీని వెనుక కుట్ర ఉందని టీఎంసీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితురాలిని విచారిస్తున్నారు. వీడియో ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నారు.
