గవర్నర్‌‌‌‌ కోటా ఎమ్మెల్సీగా చాన్స్ ఇవ్వండి : డా. పెరుమాండ్ల రామకృష్ణ

గవర్నర్‌‌‌‌ కోటా ఎమ్మెల్సీగా చాన్స్ ఇవ్వండి : డా. పెరుమాండ్ల రామకృష్ణ
  • రాహుల్‌‌ గాంధీకి డా. పెరుమాండ్ల రామకృష్ణ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, వెలుగు: త్వరలో ఖాళీ కానున్న గవర్నర్‌‌‌‌ కోటా ఎమ్మెల్సీ స్థానానికి తనకు చాన్స్​ఇవ్వాలని కాంగ్రెస్‌‌‌‌ అగ్రనేత, లోక్‌‌‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌‌‌‌ గాంధీకి డా. పెరుమాండ్ల రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో రాహుల్‌‌‌‌ను మర్యాదపూర్వకంగా కలిసి తన బయోడేటాను అందజేశారు. పార్టీ బలోపేతంతో పాటు సేవా, వైద్య రంగాల్లో తాను చేస్తున్న కృషిని వివరించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తన కుటుంబం తరతరాలుగా కాంగ్రెస్‌‌‌‌కు విధేయంగా ఉందని తెలిపారు.

ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌యూఐలో సాధారణ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి, దాదాపు రెండు దశాబ్దాలుగా పార్టీలో కొనసాగుతున్నట్లు చెప్పారు. విదేశాల్లో వైద్య విద్య అభ్యసించినా, సొంత రాష్ట్ర ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని వివరించారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వ హయాంలో కేసీఆర్‌‌‌‌ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినందుకు ప్రస్తుత కాంగ్రెస్‌‌‌‌ ఎమ్మెల్యేలతో పాటు తాను కూడా జైలుకు వెళ్లినట్లు గుర్తుచేశారు.

సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. వరంగల్‌‌‌‌ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి, రామకృష్ణ చారిటబుల్‌‌‌‌ ట్రస్ట్‌‌‌‌ ద్వారా సేవా కార్యక్రమాలకు చేస్తున్న కృషిని వివరించారు. తన సేవలను గుర్తించి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని కోరినట్లు వెల్లడించారు. రాహుల్‌‌‌‌ గాంధీ తన విజ్ఞప్తిపై సానుకూలంగా 
స్పందించారని తెలిపారు.