మహారాష్ట్రలో హైరైజ్ బిల్డింగ్ లో భారీ అగ్ని ప్రమాదం.. ఇద్దరు మహిళలు సజీవ దహనం

మహారాష్ట్రలో హైరైజ్ బిల్డింగ్ లో భారీ అగ్ని ప్రమాదం.. ఇద్దరు మహిళలు సజీవ దహనం

మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నాలాసోపారా ప్రాంతంలో హైరైజ్ బిల్డింగ్ లో 8వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే 10వ అంతస్తు వరకు మంటలు వ్యాపించాయి. దీంతో అపార్టుమెంట్ వాసులు  భయంతో పరుగులు పెట్టారు. మంటల్లో చిక్కుకుని ఇద్దరు మహిళలు సజీవ దహనమయ్యారు. 15 మందిని ఫైర్ సిబ్బంది రక్షించారు. వివరాల్లోకి వెళితే..

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా నలసోపారా–వసాయి లింక్ రోడ్డులోని ఇంపీరియల్ హైట్స్ భవనంలో మంగళవారం (అక్టోబర్ 13) రాత్రి ఈ ప్రమాదం జరిగింది. భవనంలోని 8వ అంతస్తు నుంచి 10వ అంతస్తు వరకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక, పోలీసు, పరిపాలనా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటల్లో చిక్కుకుని ఫల్గుణి షా (50), అశ్విని పార్కర్ (50) అనే ఇద్దరు మహిళలు సజీవ దహనమయ్యారు.  మరికొంత మంది అపార్టుమెంటు వాసులను ఫైర్ సిబ్బంది రక్షించారు.

భవనంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే, అగ్నిప్రమాదానికి అసలు కారణం ఇంకా తెలియరాలేదు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.