- పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్ నిధులు విడుదల
- హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఫీజు బకాయిలకు రూ.14.68 కోట్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఎస్సీ విద్యార్థులకు ప్రభుత్వం స్కాలర్షిప్ నిధులు విడుదల చేసింది. 2026-–27 విద్యా సంవత్సరానికి సంబంధించి 32,976 మంది పోస్టుమెట్రిక్ విద్యార్థులకు రూ.204.40 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.101.44 కోట్లు, కేంద్ర ప్రభుత్వం రూ.102.96 కోట్లు విడుదల చేసినట్లు సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
విద్యార్థుల ఉన్నత చదువులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా స్కాలర్షిప్ అందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కాలేజీల నుంచి వచ్చే పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి, అర్హులకు విడతల వారీగా నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. స్కాలర్షిప్ల చెల్లింపులు సకాలంలో జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్పీఎస్)కు సంబంధించి పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిల చెల్లింపుల కోసం ప్రభుత్వం మరో రూ.14.68 కోట్లు విడుదల చేసింది. విద్యార్థుల చదువులు, సంక్షేమానికి అవసరమైన నిధులు అందించడంతో పాటు, అర్హులందరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.
