నిజామాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ సెక్రటరీని నిర్బంధించిన గ్రామస్తులు

నిజామాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ సెక్రటరీని నిర్బంధించిన గ్రామస్తులు

నిధుల దుర్వినియోగం, ఇంటి నంబర్ల కేటాయింపులో అక్రమాలపై ఆరోపణలు
 
కోటగిరి, వెలుగు: నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం హంగార్గ గ్రామంలో గ్రామపంచాయతీ సెక్రటరీ గంగారాంపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు ఆయనను పంచాయతీ ఆఫీస్​లో నిర్బంధించారు. జీపీ నిధుల దుర్వినియోగం, నిబంధనలకు విరుద్ధంగా ఇంటి నంబర్ల కేటాయింపులు జరుగుతున్నాయని ఆరోపించారు. సెక్రటరీ ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు కేటాయించడంతో పాటు, ఒకరి ఇంటి పన్నులను మరొకరి పేరుపై నమోదు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు.

ఇంటి నంబర్ల కేటాయింపు కోసం రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారని, ఏజెంట్ల ద్వారా కలెక్షన్లు చేస్తున్నారని పేర్కొన్నారు. తన బదిలీ ఉత్తర్వులు వచ్చాయని తెలుసుకున్న ఆయన మంగళవారం ఉదయం పంచాయతీ కార్యాలయానికి వచ్చి తనకు అనుకూలమైన వారికి ఇంటి నంబర్లు కేటాయించి రసీదులు జారీ చేశారని ఆరోపించారు.

సెక్రటరీని విధుల నుంచి తొలగించి, ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై వివరణ కోరగా, ఎంపీడీవో సూచనల మేరకే ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు కేటాయించినట్టు సెక్రటరీ సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న డీఎల్పీవో నాగరాజు సంబంధిత అధికారిని గ్రామానికి పంపించారు. ఆరోపణల నేపథ్యంలో పంచాయతీ రికార్డులను ఆఫీసర్లు సీజ్ చేశారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని, నిబంధనలకు విరుద్ధంగా కేటాయించిన ఇంటి నంబర్లను రద్దు చేస్తామని 
తెలిపారు.