యాదగిరి గుట్టలో భక్తులకు మెరుగైన సేవలు.. ఆర్చి, నిత్యకల్యాణ మండపాలకు భూమిపూజ: వైటీడీ బోర్డు

యాదగిరి గుట్టలో భక్తులకు మెరుగైన సేవలు.. ఆర్చి, నిత్యకల్యాణ మండపాలకు భూమిపూజ: వైటీడీ బోర్డు
  •  అక్టోబర్ 30న ఆర్చి, నిత్యకల్యాణ మండపాలకు భూమిపూజ
  •  వైటీడీ బోర్డు చైర్మన్ మన్నె సత్యనారాయణ రెడ్డి వెల్లడి

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి, భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తామని వైటీడీ చైర్మన్‌‌‌‌ మన్నె సత్యనారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం యాదగిరిగుట్టలో నిర్వహించిన ధర్మకర్తల మండలి సమావేశంలో 23 అంశాలకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. హిందుస్థాన్‌‌‌‌ ఏరోనాటిక్స్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ (హెచ్‌‌‌‌ఏఎల్‌‌‌‌) సీఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ నిధులతో శ్రీలక్ష్మీనరసింహస్వామి సంస్కృత విద్యాపీఠానికి శాశ్వత భవనం నిర్మించనున్నారు. 

కొండకింద అన్నదాన సత్రం వద్ద అధునాతన షెడ్‌‌‌‌, స్టెయిన్‌‌‌‌లెస్‌‌‌‌ స్టీల్‌‌‌‌ క్యూలైన్లు ఏర్పాటు చేయనున్నారు. రాయిగిరి వద్ద కొత్త స్వాగత ఆర్చిగేటు, కొండపై పాత బాలాలయం ప్రాంగణంలో రంగమంటపం నిర్మాణానికి ఈ నెల 30న భూమిపూజ చేయనున్నారు. పాతగుట్ట ఆంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణానికీ నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్‌‌‌‌ 28 నుంచి నవంబర్‌‌‌‌ 1 వరకు నిర్వహించే తెలంగాణ వేద విద్వాన్‌‌‌‌ మహాసభలకు రూ.13.66 లక్షలు కేటాయించారు. నవంబర్‌‌‌‌ 20 నుంచి 22 వరకు కార్తీక ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఆలయ సిబ్బంది, రిటైర్డ్‌‌‌‌ పెన్షనర్లకు పెరిగిన డీఏ, డీఆర్‌‌‌‌ మంజూరుకు బోర్డు ఆమోదం తెలిపింది.

ఏఐతో భక్తుల రద్దీ నియంత్రణ..

వీకెండ్స్, పండుగల సమయంలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు ఏఐ సహా ఆధునిక సాంకేతికతను వినియోగిస్తామని బోర్డు సభ్యుడు తూళ్ల విజయేందర్‌‌‌‌గౌడ్‌‌‌‌ తెలిపారు. ఆలయం పేరుతో నకిలీ వెబ్‌‌‌‌సైట్లు, తప్పుడు ప్రచారాలు, అనధికారిక కరపత్రాల పంపిణీని ఖండించారు. సమావేశంలో బోర్డు సభ్యులు, ఎండోమెంట్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ హనుమంతరావు, ఆలయ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.