కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న IDBI బ్యాంక్ ప్రైవేటీకరణ స్పీడు పెంచింది. ఐడీబీఐ బ్యాంకులో ఉన్న మొత్తం 60.72 శాతం వాటాలను కెనడాకు చెందిన 'ఫెయిర్ఫాక్స్ ఫెనాన్షియల్ హోల్డింగ్స్' మాతృ సంస్థ కెనడా ఇన్కార్పొరేటెడ్ సంస్థకు అమ్మేందుకు కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది. ఈ భారీ డీల్ విలువ రూ. 52వేల 878 కోట్లుగా ఉంది. ఎయిర్ ఇండియా అమ్మకం తర్వాత ప్రభుత్వ రంగంలో జరిగిన అతిపెద్ద పెట్టుబడి ఉపసంహరణ ఇదే.
ఈ లావాదేవీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తన వద్ద ఉన్న 30.48 శాతం వాటాను, అలాగే LIC దగ్గర ఉన్న 30.24 శాతం వాటాను పూర్తిగా కెనడా సంస్థకు అమ్మేస్తోంది. ఈ డీల్ పూర్తయిన తర్వాత కూడా ప్రభుత్వానికి బ్యాంకులో 15 శాతం వాటా ఉండగా.. ఎల్ఐసీ వద్ద మరో 19 శాతం వాటా కొనసాగుతుంది. రెండు ఇండిపెండెంట్ వాల్యుయేషన్ ఏజెన్సీలు నిర్ణయించిన ఫెయిర్ వాల్యూ రూ.75.99 కంటే కొద్దిగా ఎక్కువగా.. ఒక్కో షేరుకు రూ.81 చొప్పున కొనేందుకు ఫెయిర్ఫాక్స్ సంస్థ బిడ్ దాఖలు చేసింది.
ఇది మెుత్తం రెండు దశల పోటీ బిడ్డింగ్ ద్వారా నిర్వహించారు. మొదటగా 2022 అక్టోబరు 7న ఆసక్తి వ్యక్తీకరణ(EOI) ప్రకటన వెలువడగా, ఐదు సంస్థలు బిడ్ దాఖలు చేశాయి. ఇందులో అర్హత సాధించిన నాలుగు పార్టీల్లో రెండు సంస్థలు మాత్రమే టెక్నో-ఫైనాన్షియల్ బిడ్లను సమర్పించాయి. RBI రూల్స్ ప్రకారం 'ఫిట్ అండ్ ప్రాపర్'గా నిరూపించుకుని, హోం మంత్రిత్వ శాఖ భద్రతా అనుమతులు పొందిన తర్వాతే ఈ బిడ్డింగ్ ప్రక్రియను పూర్తి చేశారు.
ALSO READ : పీఎఫ్ విత్డ్రా రూల్స్ మార్పు
ప్రభుత్వ కార్యదర్శుల కోర్ గ్రూప్ సిఫార్సులు, కేబినెట్ మంత్రులతో కూడిన ప్రత్యామ్నాయ యంత్రాంగం పరిశీలన తర్వాతే ఫైనల్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ భారీ విక్రయం ద్వారా బ్యాంకింగ్ రంగంలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ వేగవంతం కావడంతో పాటు, ఐడీబీఐ బ్యాంక్ భవిష్యత్తులో మరింత వృద్ధి సాధించేందుకు అవకాశం ఏర్పడనుంది.
