హుస్సేన్‌సాగర్‌లో ఆరేళ్ల చిన్నారిని తల్లి తోసేసిన ఘటన... ఆటో డ్రైవర్ ను సన్మానించిన సీపీ సజ్జనార్..

హుస్సేన్‌సాగర్‌లో ఆరేళ్ల చిన్నారిని తల్లి తోసేసిన ఘటన... ఆటో డ్రైవర్ ను సన్మానించిన సీపీ సజ్జనార్..

హైదరాబాద్ లో ఇటీవల ఆరేళ్ళ చిన్నారిని తల్లి హుస్సేన్ సాగర్ లో తోసేసిన ఘటన అందరి హృదయాలను కలిచివేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చిన్నారిని ప్రాణాలకు తెగించి హుస్సేన్ సాగర్ లో దూకి కాపాడాడు ఆటో డ్రైవర్ ఫక్రుద్దీన్. బుధవారం ( అక్టోబర్ 14 ) ఆటో డ్రైవర్ తో పాటు పాపను కాపాడిన మరో ఇద్దరు పౌరులు బాలకృష్ణ, అఫ్సర్ లను సన్మానించారు సీపీ సజ్జనార్. చిన్నారి ప్రాణాలు కాపాడిన ముగ్గురు సన్మానించి, శాలువాతో సత్కరించి నగదు పురస్కారం అందజేశారు సజ్జనార్.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రాణాలకు తెగించి హుస్సేన్ సాగర్ లో దూకి ఆటో డ్రైవర్ ఫక్రుద్దీన్, మరో ఇద్దరు పౌరులు పాప ప్రాణాలు కాపాడారని అన్నారు. బాలకృష్ణ అప్రమత్తత, ఫక్రుద్దీన్, అప్సర్ తెగువతో పాపకు పునర్జన్మ లభించిందని అన్నారు.ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మొబైల్ లో వీడియోలు తీయడం కాకుండా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని అన్నారు. పాపను కాపాడిన ముగ్గురు పౌరుల మానవతా దృక్పథం సమాజానికి ఆదర్శమని అన్నారు.

ALSO READ : మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్ కేసులో సంచలన తీర్పు

చిన్నారిని తల్లి హుస్సేన్ సాగర్ లో తోసేసిన సమయంలో నీటిలో మునిగిపోతూ అమ్మ తోసేసిందంటూ కేకలు వేసిందని.. చిన్నారి అరుపులు విని వెంటనే అప్రమత్తం చేశానని అన్నారు బాలకృష్ణ. ఆటో డ్రైవర్ ఫక్రుద్దీన్ ప్రాణాలకు తెగించి నీటిలో దూకి పాపను కాపాడారని అన్నారు.