IND vs WI మ్యాచ్‌ టికెట్ల దందా.. 6 వేలకు ఫ్రీ పాస్‌లను అమ్మేసిన HCA సభ్యుడు.. నలుగురు అరెస్ట్!

IND vs WI మ్యాచ్‌ టికెట్ల దందా.. 6 వేలకు ఫ్రీ పాస్‌లను అమ్మేసిన HCA సభ్యుడు.. నలుగురు అరెస్ట్!

IND vs WI: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్ వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య కాసేపట్లో జరగనున్న నాలుగో టీ20 మ్యాచ్‌కు ముందు బ్లాక్ టికెట్ల దందా తీవ్ర కలకలం రేపుతుంది. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులని అదుపులోకి తీసుకుంది. కాగా ఫ్రీగా వచ్చిన కాంప్లిమెంటరీ పాస్‌లను సోషల్ మీడియా వేదికగా అధిక ధరలకు అమ్ముతున్న నలుగురు సభ్యుల ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో ఏకంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) సభ్యుడు ఉండటం గమనర్హం. 

ఎక్కడ, ఎలా పట్టుబడ్డారు?: 

* అరెస్ట్ వివరాలు: బేగంబజార్‌లోని ఎస్డీ మాల్ సమీపంలో అక్టోబర్ 12వ తేదీన అనుమానాస్పదంగా తిరుగుతున్న అవినాశ్ దారక్, మోహిత్ సోమానిలను గోషామహల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

* స్వాధీనం చేసుకున్న వస్తువులు: వీరి దగ్గర నుంచి నాట్ ఫర్ సేల్ (Not for Sale) అని ముద్రించిన 11 కాంప్లిమెంటరీ క్రికెట్ పాస్‌లతో పాటు 8 నవరాత్రి డాండియా పాస్‌లు, రూ. 5,000 నగదు, మొబైల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.   

* అసలు సూత్రధారి ఎవరు?: పోలీసుల విచారణలో నిందితులు విస్తుపోయే నిజాలు వెల్లడించారు. హెచ్‌సీఏ సభ్యుడైన సతీష్ చంద్ర శ్రీవాస్తవ తన కుమారుడు ఆకర్షిత్ శ్రీవాస్తవకు ఇచ్చిన ఉచిత పాస్‌లను వీరికి విక్రయానికి అప్పగించారు.   

వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో టికెట్లు అమ్మకం: 

ఆకర్షిత్ నుంచి పాస్‌లు పొందిన అవినాశ్ దారక్, తన బావమరిది మోహిత్ సోమానితో కలిసి వాటిని సోషల్ మీడియాలోకి అమ్మకానికి పెట్టారు. 

* వాట్సాప్ స్టేటస్, ఇంస్టాగ్రామ్ ద్వారా ఆఫర్లు పెట్టి.. సీటింగ్ బట్టి ఒక్కో పాస్‌ను రూ. 3,500 నుంచి రూ. 6,000 వరకు ఎక్కువ ధరలకు అమ్ముతూ అమాయకపు అభిమానులను మోసం చేస్తున్నట్లు తేలింది. దీంతో పోలీసులు హెచ్‌సీఏ సభ్యుడు సతీష్ చంద్ర శ్రీవాస్తవ, ఆయన కుమారుడు ఆకర్షిత్ శ్రీవాస్తవలతో పాటు అవినాశ్, మోహిత్‌లను అక్టోబర్ 13న అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. వీరిపై భారతీయ న్యాయ సంహిత (BNS), సిటీ పోలీస్ యాక్ట్ లోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.    

పోలీసుల హెచ్చరికలు: 

మ్యాచ్ టికెట్ల బ్లాక్ మార్కెటింగ్‌పై పోలీసులు తీవ్రంగా స్పందించారు. అభిమానులు ఎప్పుడూ అధికారిక ఛానెళ్ల ద్వారా మాత్రమే టికెట్లు కొనుగోలు చేయాలని, ముఖ్యంగా Not for Sale అని ముద్రించిన పాస్‌లను కొని మోసపోవద్దని హెచ్చరించారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటివారిపై అయినా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.