పీఎఫ్ విత్‌డ్రా రూల్స్ మార్పు: ఏ అవసరానికి ఎన్నిసార్లు డబ్బులు తీసుకోవచ్చో తెలుసా?

పీఎఫ్ విత్‌డ్రా రూల్స్ మార్పు: ఏ అవసరానికి ఎన్నిసార్లు డబ్బులు తీసుకోవచ్చో తెలుసా?

పీఎఫ్ ఖాతాదారుల కోసం కొత్తగా అడ్వాన్స్ విత్‌డ్రా రూల్స్ స్పష్టం చేసింది ఈపీఎఫ్ఓ. అత్యవసర సమయాల్లో, వైద్య అవసరాలు ప్రత్యేక పరిస్థితుల్లో పీఎఫ్ డబ్బును ఏ విధంగా, ఎన్నిసార్లు విత్‌డ్రా చేసుకోవచ్చనే దానిపై ఈపీఎఫ్‌వో ఒక క్లారిటీ గైడ్‌ను విడుదల చేసింది. ఖాతాదారులు తమ అవసరాలకు తగినట్లుగా పీఎఫ్ సేవింగ్స్ ఎలా ఉపయోగించుకోవచ్చో మూడు ప్రధాన కేటగిరీలుగా విభజించి వివరంగా వెల్లడించింది.

మొదటి కేటగిరీలో అత్యవసర, ప్రాథమిక అవసరాలకు సంబంధించిన విత్‌డ్రా నిబంధనలు ఉన్నాయి. ఇందులో అనారోగ్య సమస్యల కోసం ఉద్యోగి లేదా వారి కుటుంబ సభ్యుల వైద్య అవసరాల నిమిత్తం ఎలాంటి సంఖ్యాపరమైన లిమిట్ లేకుండా ఎన్నిసార్లయినా డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఇక పిల్లల చదువు అవసరాల కోసం పీఎఫ్ మెంబర్‌షిప్ కాలంలో గరిష్టంగా 10 సార్లు డబ్బులు తీసుకోవడానికి అనుమతి ఉంది. అలాగే పెళ్లి ఖర్చుల కోసం ఉద్యోగి తన కుటుంబం కోసం గరిష్టంగా 5 సార్లు అడ్వాన్స్ పొందవచ్చు.

రెండో కేటగిరీ కింద గృహావసరాలకు సంబంధించిన విత్‌డ్రా నిబంధనలను పొందుపరిచారు. ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు చేయడానికి, ఇల్లు నిర్మించుకోవడానికి, హోమ్ లోన్ తిరిగి చెల్లించడానికి, ఇప్పటికే ఉన్న ఇంటిని రెనోవేట్ చేసుకునేందుకు పీఎఫ్ సభ్యత్వ కాలంలో గరిష్టంగా 5 సార్లు మాత్రమే విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. 

►ALSO READ | మాజీ ఉద్యోగికి విప్రో లీగల్ నోటీసులు.. రూ.30వేలు కట్టకపోతే క్రిమినల్ కేసు పెడతామని బెదిరింపు

ఇక 3వ కేటగిరీలో ప్రత్యేక పరిస్థితులు, అత్యవసర విపత్తుల గురించి వివరించారు. ప్రకృతి వైపరీత్యాలు లేదా ఇతర నిర్దిష్ట అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 2 సార్లు మాత్రమే పీఎఫ్ అడ్వాన్స్ తీసుకోవడానికి వీలుంటుంది. ఈ నిబంధనలన్నీ కేవలం అవసరాలకే కాకుండా, సభ్యులు రిటైర్మెంట్ సేవింగ్స్‌ను పూర్తిగా కోల్పోకుండా ఒక క్రమశిక్షణలో ఉంచడానికి సహాయపడతాయి.

అలాగే మరో ముఖ్యమైన నిబంధన ఏమిటంటే.. పీఎఫ్ మెంబర్‌షిప్ ఓపేన్ చేసి 12 నెలలు దాటిన తర్వాత ఉద్యోగి, యజమాని వాటాతో పాటు వడ్డీ కలుపుకుని మొత్తం పీఎఫ్ బ్యాలెన్స్‌లో గరిష్టంగా 75 శాతం వరకు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. పీఎఫ్ ఖాతాదారులు ఏదైనా అవసరం కోసం దరఖాస్తు చేసుకునే ముందు ఆయా నిబంధనలను, అర్హతలను పరిశీలించుకోవడం మంచిది.