న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా, అజింక్య షిండే తదితరులపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా జంతర్ మంతర్‌లోకి ప్రవేశించారన్న ఆరోపణలతో పాటు గతంలో కుదుర్చుకున్న శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు వీరిపై పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.
దేశ రాజధానిలో దశాబ్ధాలుగా ధర్నాలకు వేదికగా నిలిచిన జంతర్ మంతర్‌ను కేంద్ర హోంశాఖ ధర్నా చౌక్‌గా ఎత్తివేసిన విషయం తెలిసిందే. శాంతి భద్రతలు, ఇతర కారణాల దృష్ట్యా జంతర్ మంతర్ దగ్గర నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు నిర్వహించడంపై ఢిల్లీ పోలీసులు పూర్తిగా నిషేధం విధించారు.
జంతర్ మంతర్‌కు ప్రత్యామ్నాయంగా నిరసన వేదికలుగా మరో మూడు ప్రాంతాలను కేటాయించారు. అయినప్పటికీ, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ పార్టీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా, అజింత్య షిండే తదితరులు తాళం వేసిన ఓ ఇంటి గేట్ దూకి జంతర్ మంతర్‌లోకి ప్రవేశించారు.
వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు వీరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిబంధనలను అతిక్రమిస్తూ జంతర్ మంతర్‌లోకి ప్రవేశించడంతో పాటు గతంలో కుదుర్చుకున్న శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలపై సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.
సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 10న జంతర్ మంతర్ దగ్గర సీజేపీ భారీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. సీజేపీ ఆందోళన నేపథ్యంలో అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను ఢిల్లీ పోలీసులు ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు.
24 గంటల అనంతరం వీరిని పోలీసులు విడుదల చేశారు. రాబోయే రెండేళ్ల పాటు శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగించమని.. ఎలాంటి ఆందోళనలు నిర్వహించబోమని హామీ పత్రం ఇవ్వడంతో వీరిని విడుదల చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. దీనిని సీజేపీ ఖండించింది. నిరసనలు చేయబోమని ఎలాంటి హామీ పత్రం ఇవ్వలేదని.. తమ పోరాటం భవిష్యత్‌లోనూ కొనసాగుతోందని సీజేపీ స్పష్టం చేసింది.
