చికాగోలోని ఒక హిందూ దేవాలయంలో సామూహిక కాల్పులకు పాల్పడాలని కుట్ర పన్నాడనే ఆరోపణలపై పాపరాకిస్ అనే 19 ఏళ్ల టీనేజర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పాలటైన్‌కు చెందిన టాకో బెల్ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లో క్యాషియర్‌గా పాపరాకిస్ పనిచేస్తున్నాడు. జాత్యంహకారంతో, మతోన్మాదంతో పాపరాకిస్ రగిలిపోతుండేవాడు. ఈ క్రమంలో.. హిందూ దేవాలయంలో నవరాత్రుల సమయంలో కాల్పులకు తెగబడాలని భావించాడు.
Breaking: Video of police arresting 19-year old white supremacist who planned a mass shooting targeting Indians at a Hindu temple in Illinois https://t.co/dbthGxYw9c
— Shashank Mattoo (@MattooShashank) October 15, 2026
అక్టోబర్ 11న ఆదివారం రోజు అరోరా ప్రాంతంలోని ఒక హిందూ దేవాలయంలో కాల్పులు జరపాలని ప్లాన్ చేశాడు. ఈ క్రమంలోనే.. ఆదివారం తన జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజు కాబోతుందని సహోద్యోగులతో చెప్పాడు. అయితే.. అప్పటికే తుపాకీ, బులెట్స్ తెచ్చుకున్న పాపరాకిస్ తన గన్ జామ్ అయిందని.. అందుకే ఎవరికీ కనబడకుండా ఆ హిందూ దేవాలయం దగ్గర నుంచి వెళ్లిపోయానని తన సహోద్యోగికి కాల్ చేసి చెప్పాడు. ఈ సమాచారాన్ని సదరు సహోద్యోగి భయంతో పోలీసులకు తెలియజేయడంతో పాపరాకిస్ను అరెస్ట్ చేశారు.
పాపరాకిస్లో అణువణువునా శ్వేత జాతీయుల ఆధిపత్య ధోరణి, జాత్యంహకార భావన కనిపించింది. ఇందుకు సంబంధించి అతని దగ్గర కొన్ని స్వీయ పత్రాలు కూడా ఉన్నాయి. ‘‘నేను ఎందుకు పోరాడాను: అకా (అరోరా షూటర్ మేనిఫెస్టో)’’ అనే టైటిల్‌తో ఎనిమిది పేజీల డాక్యుమెంట్‌ను పాపరాకిస్ తన సహోద్యోగికి పంపించాడు. ఈ డాక్యుమెంట్లో ఇండియన్స్, జ్యుయిష్, ఆఫ్రికన్ అమెరిన్ ప్రజలను నీచమైన మనుషులుగా పాపరాకిస్ అభివర్ణించాడు. వీలైనంత ఎక్కువ మందిని చంపడానికి పన్నిన కుట్రగా వివరించాడు.
అతని ఇంట్లో సోదా చేయగా.. సీరియల్ నెంబర్ లేని ఏఆర్ స్టైల్ రైఫిల్, లోడెడ్ మ్యాగజైన్స్, మందు గుండు సామగ్రి, గ్యాస్ క్యాన్, నాజీ చిహ్నాలను కలిగి ఉన్న అనేక వస్తువులను డిటెక్టివ్స్ సీజ్ చేశారని పోలీసులు తెలిపారు. పాపరాకిస్ తను రాసుకున్న పత్రాల్లో.. తనను తాను "ద్వేషంతో నిండిన, దాదాపు ప్రతిరోజూ సామూహిక హత్యల గురించి కలలు కనే ఒక సమాజ వ్యతిరేక శ్వేతజాతి ఆధిపత్యవాది, నయా నాజీ"గా అభివర్ణించుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. విచారణ పూర్తయ్యే వరకు పాపరాకిస్ జైలులోనే ఉండాలని న్యాయమూర్తి బుధవారం తీర్పు ఇచ్చారు. అతను తదుపరి అక్టోబర్ 30న కోర్టులో హాజరు కావాల్సి ఉంది.
