ఆంధ్రాలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారాయి. కూటమి పొత్తు ధర్మంలో భాగంగా.. దాదాపు 40 శాతం సీట్లను ఆశిస్తూ జనసేన ఉంచిన ప్రతిపాదనకు భంగపాటు తప్పలేదు. ఏపీలో మొత్తం 17 మున్సిపల్ కార్పొరేషన్లు ఉండగా.. 13 స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఈ 13 స్థానాల్లో 4 స్థానాలను జనసేనకు టీడీపీ ఆఫర్ చేసింది.
దాదాపు 40 మున్సిపాలిటీలను జనసేన డిమాండ్ చేయగా 20-23 మున్సిపాలిటీల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. విజయవాడ, కాకినాడ, తిరుపతి, ఏలూరు కార్పొరేషన్లలో జనసేన పోటీ చేసే అవకాశం ఉంది. తిరుపతి, విజయవాడ కార్పొరేషన్లకు సంబంధించి ఆసక్తికర రాజకీయం నడిచిన సంగతి తెలిసిందే.
విజయవాడ విషయానికొస్తే.. నిన్నమొన్నటి వరకూ టీడీపీలో ఉన్న వంగవీటి రాధా విజయవాడ మేయర్ రేసులో నిలిచేందుకు జనసేనలో చేరిపోయారు. ఇక.. తిరుపతిలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. తిరుపతిలో టీడీపీ నేత ప్రణీత్ పెనుమాదు తిరుపతి మేయర్ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు పవన్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. ఈ రెండు కార్పొరేషన్లలో ఇద్దరూ జనసేన అభ్యర్థులే. కానీ.. వ్యూహాత్మకంగా టీడీపీ నుంచి జనసేనలో చేరారు.
ఇక.. బీజేపీకి ఒకేఒక్క కార్పొరేషన్ను.. రాజమండ్రి కార్పొరేషన్ను పొత్తు ధర్మంలో భాగంగా టీడీపీ ఆఫర్ చేసినట్లు సమాచారం. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఎన్నికల సంఘం ఏపీలోని మొత్తం 123 లోకల్ బాడీలకు గానూ 100 లోకల్ బాడీలకు షెడ్యూల్ విడుదల చేసింది. 10 నగర పంచాయతీలు, 77 మున్సిపాలిటీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది.
టీడీపీతో సుదీర్ఘ చర్చల తర్వాత.. జనసేన 4 కార్పొరేషన్లు, 20 నుంచి 24 మున్సిపాలిటీలు, 3 నుంచి 4 నగర పంచాయతీల్లో పోటీ చేసే అవకాశం ఉందని ఏపీ రాజకీయాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈరోజు (గురువారం, అక్టోబర్ 15) సాయంత్రం లోపు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
