సాగుకు నీళ్లు విడుదల చేయాలని ఆందోళన: ఎస్సారెస్పీ డీ 86 కాలువ వద్ద బీఆర్ఎస్, బీజేపీ నిరసనలు

సాగుకు నీళ్లు విడుదల చేయాలని ఆందోళన: ఎస్సారెస్పీ డీ 86 కాలువ వద్ద బీఆర్ఎస్, బీజేపీ నిరసనలు
  • నీళ్లు విడుదల చేయకుంటే బ్రిడ్జిపై నుంచి దూకుతానని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల హెచ్చరిక
  • కాలువ గేట్లు తెరిచే ప్రయత్నం చేసిన బీజేపీ లీడర్లు అరెస్ట్ 

చొప్పదండి/ కరీంనగర్ రూరల్, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌, చొప్పదండి నియోజకవర్గాల పరిధిలో సాగునీరు అందక ఎండిపోతున్న పంటలకు ఎస్సారెస్పీ కాలువ నీటిని విడుదల చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేస్తూ బుధవారం బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌, బీజేపీ నాయకులు వేర్వేరుగా ఆందోళన చేపట్టారు. చొప్పదండిలోని ఎస్సారెస్పీ డీ-86 కాలువ వద్ద నిరసన తెలిపారు. మొదట కరీంనగర్‌‌‌‌‌‌‌‌ రూరల్‌‌‌‌‌‌‌‌ మండలం నగునూర్‌‌‌‌‌‌‌‌లో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌, మండలాధ్యక్షుడు సంతోష్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో నాయకులు, రైతులు ఆందోళన నిర్వహించారు. 

అనంతరం చొప్పదండిలోని ఎస్సారెస్పీ కాలువ హెడ్‌‌‌‌‌‌‌‌ రెగ్యులేటర్‌‌‌‌‌‌‌‌ వద్దకు చేరుకొని గేట్లు తెరిచి నీటిని విడుదల చేసేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. మరోవైపు సాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేస్తూ కరీంనగర్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌‌‌‌‌‌‌‌ రైతులతో కలిసి ఆందోళనకు దిగారు. చొప్పదండి చౌరస్తా నుంచి ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌పై రైతులను తీసుకొని, స్వయంగా ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ నడుపుతూ డీ-86 కాలువ వద్దకు చేరుకున్నారు. 

అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘మా నీళ్లు మాకే కావాలి’ అంటూ రైతులు నిరసన తెలిపారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు నీటిని విడుదల చేయకపోతే కెనాల్‌‌‌‌‌‌‌‌ బ్రిడ్జిపై నుంచి నీటిలో దూకుతానని గంగుల అధికారులను హెచ్చరించారు. అనంతరం రెగ్యులేటర్‌‌‌‌‌‌‌‌ గేట్లు తెరిపించి నీటిని విడుదల చేయించారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ కరీంనగర్‌‌‌‌‌‌‌‌, చొప్పదండి నియోజకవర్గాల రైతులకు సాగునీటి పంపిణీలో వివక్ష చూపడం తగదన్నారు. పెద్దపల్లి ప్రాంత రైతులకు పంటలు ఉన్నట్లే తమ ప్రాంత రైతులకూ పంటలు ఉన్నాయన్నారు. 

రైతులందరికీ సమానంగా సాగునీరు అందించడం ప్రభుత్వంతో పాటు ఆఫీసర్ల బాధ్యతని స్పష్టం చేశారు. ప్రస్తుతం విడుదల చేసిన నీటిని తిరిగి నిలిపివేస్తే మరోసారి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. రెండు జిల్లాల కలెక్టర్లు సమన్వయంతో వ్యవహరించి కరీంనగర్‌‌‌‌‌‌‌‌, చొప్పదండి ప్రాంతాల రైతులకు సమానంగా సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఆందోళనలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌‌‌‌‌‌‌‌, కరీంనగర్‌‌‌‌‌‌‌‌ ఫ్యాక్స్‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌ శ్యాంసుందర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, జిల్లా మాజీ లైబ్రరీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ అనిల్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.