ఎల్‌‌‌‌‌‌‌‌సీ తీసుకోకుండా రిపేర్లు.. యువకుడి ప్రాణం పోయింది..మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో ఘటన

ఎల్‌‌‌‌‌‌‌‌సీ తీసుకోకుండా రిపేర్లు.. యువకుడి ప్రాణం పోయింది..మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో ఘటన

టేక్మాల్, వెలుగు : విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఓ యువకుడు బలి అయ్యాడు. ఎల్​సీ తీసుకోకుండానే ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫార్మర్ రిపేర్లు చేపట్టడంతో విద్యుత్​షాక్ తగిలి ఓ  ప్రాణం పోయింది. ఈ దుర్ఘటన సంఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని షాబాద్ తండా పంచాయతీ దండువాని కుంటలో బుధవారం జరిగింది. 

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... దండువాని కుంట తండా శివారులో ఉన్న  ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫార్మర్‌‌‌‌‌‌‌‌ను ఇటీవల ఒక చోటు నుంచి మరొక చోటుకు మార్చారు. బుధవారం ఆ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫార్మర్‌‌‌‌‌‌‌‌ కు రిపేర్లు చేసేందుకు తండాకు చెందిన విస్లావత్ అనిల్ (27) విద్యుత్ సిబ్బందికి సహకరించేందుకు ముందుకు వచ్చాడు. 

అయితే పని ప్రారంభించేముందు లైన్‌‌‌‌‌‌‌‌మెన్ హరికుమార్ లైన్ క్లియరెన్స్ (​ఎల్‌‌‌‌‌‌‌‌సీ)  తీసుకోలేదు. ఈ క్రమంలో అనిల్​ రిపేర్​ చేస్తుండగా విద్యుత్ సరఫరా కావడంతో  విద్యుత్ షాక్‌‌‌‌‌‌‌‌కు గురై అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడికి భార్య, కొడుకు,  కూతురు ఉన్నారు. 

తండాలో ఉద్రిక్తత... 

​లైన్‌‌‌‌‌‌‌‌మెన్ హరికుమార్ బాధ్యతారాహిత్యమే అనిల్ మరణానికి కారణమని తండావాసులు ఆగ్రహంతో రగిలిపోయారు. విద్యుత్ శాఖ అధికారుల తీరును నిరసిస్తూ ఘటనా స్థలంలో ఆందోళనకు దిగడంతో తండాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాధిత కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు.