తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్  కుమార్
  • ఆఫీసర్ల సలహాలతో మెరుగైన దిగుబడులు సాధించాలి
  •  జగిత్యాలలో ‘కిసాన్​ మేళా 2026’

జగిత్యాల టౌన్, వెలుగు: వాతావరణ మార్పులు, ఎల్‌‌‌‌‌‌‌‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు. జగిత్యాలలో వ్యవసాయ శాఖ ఆత్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కిసాన్ మేళా-2026’లో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్‌‌‌‌‌‌‌‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆఫీసర్ల సలహాలతో శాస్త్రీయ పద్ధతులు పాటించి మెరుగైన దిగుబడులు సాధించాలని సూచించారు. 

రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఆధునిక సాగు పద్ధతులను అందిపుచ్చుకుని పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకోవాలని కోరారు. కలెక్టర్ మాట్లాడుతూ పంటలకు నిరంతర విద్యుత్ సరఫరా అందేలా ఆఫీసర్లు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. 

మేళాలో ఏర్పాటు చేసిన వ్యవసాయ సాంకేతిక స్టాళ్లను పరిశీలించి, నూతన వంగడాలు, సాగు విధానాలపై వివరాలు తెలుసుకున్నారు. ఉత్తమ రైతులు, వ్యవసాయ అధికారులను సన్మానించారు. కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆఫీసర్లు, రైతులు పాల్గొన్నారు.