భారతీయ రైల్వే శాఖకు సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 27, 2026 నుంచి IRCTC నుంచి గానీ లేదా రైల్వే కౌంటర్ల దగ్గర ఆఫ్లైన్లో గానీ విక్రయించే అన్ని రైలు టిక్కెట్లపై ప్రయాణికులకు తప్పనిసరిగా ప్రయాణ బీమా కవరేజీని అందించాలని రైల్వే శాఖకు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
‘‘రెండు వారాలలోగా, అంటే.. 2026 అక్టోబర్ 27 నుంచి, అన్ని రైల్వే స్టేషన్లలో కౌంటర్లో విక్రయించే అన్ని టిక్కెట్లకు కూడా ఆన్లైన్లో కొనుగోలు చేసిన టిక్కెట్ల మాదిరిగానే బీమా వర్తింపజేయాలని ఆదేశిస్తున్నాము. పై ఆదేశాన్ని తప్పనిసరిగా అమలు చేయాలి, అలా చేయడంలో విఫలమైతే, బాధ్యత నేరుగా రైల్వే బోర్డుపై ఉంటుంది.” అని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.
టికెట్లు బుక్ చేసుకునే సమయంలో రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్ కనిపిస్తుంది. కానీ దీన్ని చాలా మంది పెద్దగా పట్టించుకోరు. కానీ ఈ బీమా ఎంతో ముఖ్యమైనది. ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం ఐఆర్సీటీసీ కేవలం 45 పైసలు మాత్రమే తీసుకుంటుంది. రూ.10 లక్షల వరకు బీమా కవరేజీని అందిస్తుంది. వస్తువులు, లగేజీని పోగొట్టుకున్నా ఈ బీమా ద్వారా పరిహారం పొందొచ్చు.
►ALSO READ | రెండు తలలతో పుట్టిన శిశువు.. ప్రతీ 3 లక్షల జననాల్లో ఒక్కరే ఇలా పుడతారు !
రైలు ప్రమాదం జరిగినప్పుడు మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యానికి గురైనా రూ. 10 లక్షల వరకు బీమా చెల్లిస్తారు. పాక్షికంగా అంగవైకల్యానికి గురైతే రూ.7.5 లక్షలు, తీవ్రంగా గాయపడితే రూ.2 లక్షలు, స్వల్ప గాయాలైతే రూ.10వేల వరకు అందజేస్తారు. రైలు ప్రమాదానికి గురైన 4 నెలల్లోపు బీమాను క్లెయిమ్ చేసుకోవాలి.
బీమా కంపెనీ కార్యాలయానికి వెళ్లి బీమా కోసం క్లెయిమ్ను దాఖలు చేయాలి. బీమాను ఎంచుకునే సమయంలో తప్పనిసరిగా నామినీ పేరును నమోదు చేయాల్సి ఉంటుంది. ఇకపై.. ఈ బీమాను రైల్వే టికెట్లు నేరుగా రైల్వే స్టేషన్లకు వెళ్లి టికెట్ తీసుకునే ప్రయాణికులకు కూడా వర్తింపజేయాలని సుప్రీం కోర్టు ఆదేశించడం గమనార్హం.
