- అక్టోబర్ 20 నాటికి నమోదు పూర్తి చేసేందుకు చర్యలు
- ప్రక్రియ పూర్తయ్యాకే కేంద్రం నుంచి నిధుల విడుదల
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను కేంద్ర ప్రభుత్వ ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై)’ పోర్టల్తో అనుసంధానించే ప్రక్రియను హౌసింగ్ శాఖ స్టార్ట్ చేసింది. మొదటి విడతలో భాగంగా ఇప్పటికే నిర్మాణ ప్రక్రియ పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల వివరాలను పీఎం ఆవాస్ యోజన వెబ్సైట్లో ఆఫీసర్లు నమోదు చేస్తున్నారు. ఇళ్ల వివరాలను పోర్టల్లో తప్పులు లేకుండా వేగంగా అప్లోడ్ చేసేందుకు వీలుగా హౌసింగ్ శాఖ ఆఫీసర్లు క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని సమాయత్తం చేశారు. ఇందులో భాగంగా ఇటీవల ఎంపీడీవోలకు హౌసింగ్ టెక్నికల్ అధికారులు ట్రైనింగ్ ఇచ్చారు. జిల్లాల్లో పంచాయతీ సెక్రటరీలకు ఎంపీడీవోలు ట్రైనింగ్ ఇచ్చారు. పీఎం ఆవాస్ యోజన యాప్ లైన్ లబ్ధిదారుల డేటా ఎంట్రీ, జియో ట్యాగింగ్ అంశాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
2 లక్షల ఇళ్లు మంజూరు చేసిన కేంద్రం..
ఇటీవల కేంద్ర ప్రభుత్వం పీఎం ఆవాస్ యోజన స్కీమ్ (రూరల్) కోసం 2 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. ఈ నిధులను వినియోగించుకోవడానికి వీలుగా హౌసింగ్ శాఖ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఇప్పటికే నిర్మాణ పనులు పూర్తయిన 1.75 లక్షల ఇళ్లను మొదటి విడతగా పోర్టల్లో నమోదు చేస్తున్నారు. రెండో దశలో గుడిసెలు ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇండ్లను రాష్ర్ట ప్రభుత్వం మంజూరు చేసింది. మట్టి గుడిసెలు, తాత్కాలిక నివాసాల్లో ఉంటున్న పేద వారిని గుర్తించి, 25 వేల మంది లబ్ధిదారులను ఈ విడతలో చేర్చనున్నారు. ఈ విధంగా మొత్తం 2 లక్షల ఇళ్ల వివరాలను పోర్టల్లో నమోదు చేయడం ద్వారా నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవాలని హౌసింగ్ శాఖ నిర్ణయించింది.
అక్టోబర్ 20లోగా గడువు..
ఆన్లైన్ డేటా ఎంట్రీ , జియో ట్యాగింగ్ ప్రక్రియ మొత్తాన్ని అక్టోబర్ 20వ తేదీ నాటికి పూర్తి చేయాలని హౌసింగ్ ఆఫీసర్లు గడువు విధించారు. నమోదు ప్రక్రియ సక్సెస్ఫుల్గా పూర్తయిన వెంటనే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదలవుతాయని చెబుతున్నారు. పీఎం ఆవాస్ యోజనలో రూరల్ లో ఒక్కో ఇంటికి కేంద్ర ప్రభుత్వం రూ.72 వేలు ఇవ్వనుంది. వీటితో పాటు స్వచ్ఛభారత్ కింద టాయిలెట్ల నిర్మాణానికి, వీబీ జీ రామ్ జీ కింద మరికొన్ని నిధులు ఇవ్వనుంది.
