ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో ఒక అరుదైన ఘటన జరిగింది. ఒక మహిళ రెండు తలలతో ఉన్న శిశువుకు జన్మనిచ్చింది. శనివారం (అక్టోబర్ 10) సీ-సెక్షన్ చేసి ఆ నవజాత శిశువును అమ్మ కడుపులో నుంచి మన మధ్యకు తెచ్చారు.
బెర్హంపూర్లోని ఎంకేసిజి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లోని స్పెషల్ న్యూబోర్న్ కేర్ యూనిట్ (SNCU)లో వెంటనే ఆ శిశువును చికిత్స నిమిత్తం చేర్పించారు. ఈ అరుదైన జననం.. నవజాత శిశు వైద్య సంరక్షణలోని సవాళ్లపై చర్చకు దారితీసింది.
ఒకే శరీరానికి రెండు తలలు, మెడలు అతుక్కుని ఉండే ఈ అరుదైన పుట్టుకతో వచ్చే పరిస్థితిని వైద్యపరంగా డైసెఫాలిస్ పారాపగస్ అంటారు. తల్లి కంధమాల్లోని తుముడిబంధ్ ప్రాంతానికి చెందిన నివాసి. నవ జాత శిశువు తండ్రి రోజువారీ కూలీ పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
ఈ పరిస్థితుల్లో ఉన్న కుటుంబంలో ఇలా రెండు తలలతో ఉన్న బిడ్డ పుట్టడంతో వైద్య ఖర్చులు, తదనంతర పరిస్థితులపై ఆందోళన వ్యక్తమైంది. తల్లిని కూడా మెరుగైన చికిత్స నిమిత్తం మరో ఆసుపత్రికి తరలించారు. 32 వారాల గర్భధారణ సమయంలో శిశువు జన్మించింది. ఈ దంపతులకు మొదటి సంతానం కావడం గమనార్హం.
►ALSO READ | రైల్వే ఉద్యోగులు పండగ చేస్కోండి.. 78 రోజుల శాలరీని బోనస్గా ప్రకటించిన కేంద్రం
శిశువుకు ఒక జత చేతులు, కాళ్లు, పురుష బాహ్య జననేంద్రియాలతో కూడిన ఒకే మూత్ర జననేంద్రియ మార్గం ఉన్నాయి. కలిసి పుట్టిన కవలలు అత్యంత అరుదు. ప్రతి 3 లక్షల జననాలలో కేవలం ఒకరిలో మాత్రమే ఇలా జన్మిస్తారు. రాబోయే కొద్ది రోజులు శిశువు ఆరోగ్యానికి కీలకం.
