భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. బుధవారం ( అక్టోబర్ 14 ) విజయవాడకు చేరుకున్న ఆమె ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. కనకదుర్గమ్మను దర్శించుకున్న తొలి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కావడం విశేషం. రాష్ట్రపతిగా విజయవాడకు విచ్చేసిన ఆమెకు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఘనంగా స్వాగతం పలికారు.
ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతి భక్తులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు సైతం అభివాదం చేస్తూ ఆలయంలోకి ప్రవేశించారు ద్రౌపది ముర్ము. ఆలయ అర్చకులు, వేద పండితులు సంప్రదాయ మర్యాదలతో రాష్ట్రపతికి స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంతరాలయంలోకి వెళ్లి శ్రీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ద్రౌపది ముర్ము.
ఈ సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. రాష్ట్రపతి సుమారు 8 నిమిషాల పాటు అంతరాలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు రాష్ట్రపతికి వేదాశీస్సులు, ప్రసాదాలు అందజేశారు. దేవస్థానం ఈవో వీకే శీనానాయక్ అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించగా, మంత్రి అనిత శేష వస్త్రాలను అందజేశారు.
