ఒకప్పుడు వ్యవసాయ కూలీ.. ఇప్పుడు లేడీ డాన్.. మదనపల్లె సులోచన అరెస్ట్

ఒకప్పుడు వ్యవసాయ కూలీ.. ఇప్పుడు  లేడీ డాన్.. మదనపల్లె సులోచన అరెస్ట్

ఒకప్పుడు వ్యవసాయ కూలీ. వందా వెయ్యికి ఇబ్బంది పడే పరిస్థితి. ఇప్పుడు లేడీ డాన్. వందల ఎకరాల భూములు.. కోట్ల రూపాయలు. అదెలా సాధ్యం అంటారా.. అధికారులు, రాజకీయ అండదండలుంటే మన దగ్గర ఏదైనా సాధ్యం. అలా ఎదిగిన వ్యక్తే లేడీ డాన్ సులోచన. ఆ మధ్య కాలంలో భూకబ్జాలు, అక్రమాస్తులు, సెటిల్మెంట్లతో హాట్ టాపిక్ గా మారిన సులోచన.. ఇప్పుడు 2026 అక్టోబర్ 15న పోలీసులు అరెస్టు  చేయడంతో ఒక్కసారిగా మరోసారి వార్తల్లోకెక్కారు.

అన్నమయ్య జిల్లా కేంద్రంలోని మదనపల్లె, తదితర ప్రాంతాల్లో భూ కబ్జాలు చేసి అమాయకులను మోసం చేస్తూ,14 కేసుల్లో నిందితురాలుగా రౌడీ షీట్ కలిగి ఉన్న లేడీ డాన్ కోనేటి సులోచనను పోలీసులు  ఉదయం అదుపులోకి తీసుకున్నారు. మదనపల్లె పట్టణం నీరుగట్టుపల్లికి చెందిన సులోచనపై ఇప్పటికే మదనపల్లె 1టౌన్, 2టౌన్, తాలూక తదితర పోలీస్ స్టేషన్లలో 14 చీటింగ్ కేసులతో పాటు భూ కబ్జా, హత్యా యత్నం వంటి కేసులు నమోదై ఉన్నాయి. జిల్లా ఎస్పీ ధీరజ్, అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, డిఎస్పీ ప్రసాద్ ల ఆదేశాలతో వన్ టౌన్ పోలీసులు సులోచనను అదుపులోకి తీసుకున్నారు.

సులోచన ఒకప్పుడు సాధారణ వ్యవసాయ కూలీగా జీవనం సాగించిన మహిళ. రాజకీయ నాయకులు, కొందరు అధికారుల అండదండలతో రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రవేశించి తక్కువ కాలంలోనే కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.

కోర్టు సెర్చ్ వారెంట్‌తో సెప్టెంబర్ 2026 లో పోలీసులు ఆమె నివాసాలపై దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు రూ. 50 నుండి 60 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన దాదాపు 50 ఆస్తి పత్రాలు, సంతకాలు ఫోర్జరీ చేసిన 15 ఖాళీ బాండ్ పేపర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 అప్పులు ఇస్తామని నమ్మించి ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులను కాజేయడం, నకిలీ పవర్‌ ఆఫ్ అటార్నీ (POA) ద్వారా రూ. వందల కోట్ల విలువైన ప్రభుత్వ, ప్రైవేట్ భూములను కబ్జా చేయడం వంటి ఆరోపణలపై ఈమెపై హత్యాప్రయత్నం సహా మొత్తం 14 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆమెను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.