ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. కంపెనీ వృద్ధిని వేగవంతం చేయడం, స్ట్రీమింగ్ మార్కెట్లో పోటీని తట్టుకోవడం లక్ష్యంగా పెట్టుకుని దాదాపు 1,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇది మొత్తం కంపెనీ వర్క్‌ఫోర్స్‌లో 6 శాతానికి సమానం. 2022లో ఎదురైన సబ్స్క్రైబర్ల నష్టం తర్వాత నెట్‌ఫ్లిక్స్ చేపట్టిన అత్యంత భారీ లేఆఫ్స్ రౌండ్ ఇదే.
ఈ ఉద్యోగాల కోత ప్రధానంగా ప్రొడక్ట్, టెక్నాలజీ, లీగల్, హ్యూమన్ రిసోర్సెస్ విభాగాలపై ఎక్కువగా ప్రభావం చూపనుంది. గత ఏడాది చివరి నాటికి నెట్‌ఫ్లిక్స్‌లో దాదాపు 16వేల మంది ఫుల్-టైమ్ ఉద్యోగులు పనిచేస్తుండగా.. ఈ తాజా నిర్ణయం వందలాది కుటుంబాలపై ప్రభావం చూపనుంది. ఈ కఠిన నిర్ణయానికి సంబంధించి టెడ్ సరాండోస్, గ్రెగ్ పీటర్స్ సంయుక్తంగా ఉద్యోగులకు ఈమెయిల్ ద్వారా సమాచారం అందించారు.
కేవలం సాంప్రదాయ సబ్స్క్రిప్షన్ మోడల్‌పైనే కాకుండా.. ఇతర ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టాలని నెట్‌ఫ్లిక్స్ భావిస్తోంది. ఇందులో భాగంగా యాడ్స్, లైవ్ ప్రోగ్రామింగ్, గేమింగ్ రంగాలపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. అయితే తాము ఆశించిన స్థాయిలో కంపెనీ వృద్ధి చెందడం లేదని కో సీఈఓ టెడ్ సరాండోస్ గతంలోనే అంగీకరించారు. గత 6 నెలల్లో నెట్‌ఫ్లిక్స్ షేర్లు 30 శాతానికి పైగా, ఏడాది కాలంలో ఏకంగా 40 శాతానికి పైగా పడిపోవడం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తోంది.
ALSO READ : దసరాకి బంగారం బేజారు.. వరుసగా 5వ రోజున గ్రాముకు ఎంత తగ్గిందో తెలుసా?
కంపెనీ ఈ ఏడాది తొలి అర్ధభాగంలో 97 బిలియన్ల వ్యూవింగ్ హవర్స్ నమోదు చేసినప్పటికీ.. వృద్ధి వేగంపై ఇన్వెస్టర్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఏడాదికి 2 సార్లు విడుదల చేయాల్సిన ఎంగేజ్మెంట్ డేటాను ఇకపై ఏడాదికి ఒకసారే పబ్లిష్ చేయాలన్న నిర్ణయం కూడా మార్కెట్ వర్గాలను అసంతృప్తికి గురిచేసింది. ఇదే సమయంలో కస్టమర్లపై భారం పడకుండా ఉండేందుకు మార్చిలో యూఎస్ మార్కెట్లో యాడ్-ఫ్రీ ప్లాన్, యాడ్-సపోర్టెడ్ ప్లాన్ ధరలను కూడా కంపెనీ పెంచింది. ఈ పరిణామాలన్నీ కలిసి నెట్‌ఫ్లిక్స్‌ను లేఆఫ్స్ దిశగా అడుగులు వేసేలా చేశాయని నిపుణులు అంటున్నారు.
