Ranabaali: అప్పటి ఎల్ నినో పరిస్థితులను కళ్లకు కట్టనున్న ‘రణబాలి’.. రైట్ టైంలో వస్తున్న విజయ్ దేవరకొండ మూవీ

Ranabaali: అప్పటి ఎల్ నినో పరిస్థితులను కళ్లకు కట్టనున్న ‘రణబాలి’.. రైట్ టైంలో వస్తున్న విజయ్ దేవరకొండ మూవీ

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్‌‌‌‌‌‌‌‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌‌‌‌‌‌‌‌ నిర్మించిన చిత్రం ‘రణబాలి’ (RANABAALI). రేపు శుక్రవారం (అక్టోబర్ 16, 2026న) దసరా సందర్భంగా సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ చేసిన వ్యాఖ్యలు ‘రణబాలి’ సినిమా నేపథ్యంపై ఆసక్తిని పెంచుతున్నాయి. అప్పటి రోజుల్లో ప్రజలు ఆహారం కోసం ఎలాంటి కష్టాలు పడేవారు? ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేవారు? అనే అంశాలను కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం ఈ సినిమాలో చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలోనూ ‘రణబాలి’ కథకు ప్రాధాన్యం ఏర్పడుతోందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

నీళ్లు, కరెంట్, ఫుడ్‌‌‌‌‌‌‌‌ను జాగ్రత్తగా వాడుకోవాలి: విజయ్ దేవరకొండ

హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘‘తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వపడేలా ‘రణబాలి’ వస్తోంది. రాహుల్ తను చెప్పాలనుకున్న పీరియడ్ యాక్షన్ మూవీని చరిత్రలో దాచిన కొన్ని ఘటనలతో అద్భుతంగా రూపొందించాడు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన సూపర్ ఎల్ నినో ప్రభావం సరిగ్గా 150 ఏళ్ల క్రితం వచ్చింది. అదే గ్రేట్ మద్రాస్ ఫామైన్. ఆ టైమ్​లో బ్రిటీషర్స్ చేసిన ఘోరాల వల్ల ఆ మహా కరువు 80 లక్షల మంది చావుకు కారణమైంది. ఆ బాధలు రిపీట్ కాకుండా మనం నీళ్లు, కరెంట్, ఫుడ్‌‌‌‌‌‌‌‌ను జాగ్రత్తగా వాడుకోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు వెళ్లే దమ్ము మన ఇండియన్స్లో ఉంది. గతంలో రాహుల్‌‌‌‌‌‌‌‌ తీసిన ‘టాక్సీవాలా’తో హిట్‌‌‌‌‌‌‌‌ బాట పట్టినట్టుగానే ఈ చిత్రంతో తిరిగి సక్సెస్‌‌‌‌‌‌‌‌ రాబోతోంది’ అని చెప్పాడు.

హీరోయిన్ రష్మిక మందన్న మాట్లాడుతూ ‘‘రణబాలి టీమ్ హార్డ్ వర్క్ చూస్తే భయమేసేది. ఈ చిత్రం ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళుతుంది. నాకు, విజయ్‌‌‌‌‌‌‌‌కు ఇంపార్టెంట్‌‌‌‌‌‌‌‌ సినిమా. ఇందులో లవ్ స్టోరీ కాదు కానీ ఇందులోని లవ్‌‌‌‌‌‌‌‌ ట్రాక్‌‌‌‌‌‌‌‌ బాగుంటుంది.  జయమ్మ పాత్ర మీ మనసుల్లో ఉండిపోతుంది” అని చెప్పింది.

డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ మాట్లాడుతూ  ‘‘ఆకలిని ఆయుధంగా మలుచుకుని పరాయి దేశం వాళ్లు మనల్ని 250 ఏళ్లు పాలించారు. ఆ మరుగున పడిన చరిత్ర తెలుసుకున్నప్పుడు ఎంతో డిస్ట్రబ్ అయ్యా. ఎవడో మన చరిత్రను మార్చేశారు. అందుకే మన చరిత్రను మనమే చెప్పుకుందామని మొదలైన ప్రయాణమే ఈ రణబాలి. ఈ కథలో వీరుడి లాంటి హీరో ఎవరు అనుకుంటే విజయ్ గుర్తొచ్చాడు. ఇందులో తన నటనవిశ్వరూపం చూస్తారు. భార్యా భర్తల్లా విజయ్, రష్మిక నటన ఈ సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది’’ అని చెప్పాడు.

‘‘ఒక అల్లూరి, ఒక కొమరం భీమ్‌‌‌‌‌‌‌‌లా మన తెలుగు హీరో రణబాలి. ఆ సినిమాల స్థాయిలో ఈ చిత్రాన్ని కూడా హిట్ చేయాలని కోరుకుంటున్నాం” అని నిర్మాతలు రవిశంకర్, నవీన్ యెర్నేని చెప్పారు. నటులు మైమ్ మధు, వినోద్ సాగర్, కిషోర్, వ్లాదిమిర్, గీత రచయితలు రామజోగయ్యశాస్త్రి,  డా.చక్రవర్తుల, కేశవాదిత్య, కో ప్రొడ్యూసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనురాగ్ తదితరులు పాల్గొన్నారు.  

కరువు కష్టాల మధ్య ‘రణబాలి’ పోరాటం..

చరిత్రలో కొన్ని ఘటనలు కాలగర్భంలో కలిసిపోతాయి. కానీ కొన్ని విషాదాలు మాత్రం తరాలు మారినా వాటి ఆనవాళ్లను మిగుల్చుతూనే ఉంటాయి. అలాంటి భయానక అధ్యాయమే 1876-78 మధ్య దక్షిణ భారతాన్ని అతలాకుతలం చేసిన మద్రాస్‌ మహా కరవు. ఆకలి, పేదరికం, అంటు వ్యాధులతో ఆ కాలంలో ఎన్నో కుటుంబాలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నాయి. అదే చీకటి చరిత్రను కథా నేపథ్యంగా ఎంచుకుని తెరకెక్కిన చిత్రమే ‘రణబాలి’ (Ranabaali).

టైటిల్ పాత్రలో నటిస్తున్న విజయ్ దేవరకొండ .. బ్రిటిష్ పాలనలో కరువు, ఆకలి, దోపిడీతో అల్లాడుతున్న ప్రజల కోసం పోరాడే ఓ వీరుడిగా కనిపించనున్నారు. బ్రిటిష్ అధికారులతో ఆయన చేసే పోరాటాలు, భారీ యాక్షన్ సన్నివేశాలు సినిమాలో హైలైట్‌గా నిలిచేలా ఉన్నాయి. రేపు రాబోయే ఈ సినిమ కోసం టాలీవుడ్ సినీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

80 లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన ఓ మహా విపత్తు.. 

ఈ మహాకరువులో 80 లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన ఓ మహా విపత్తు వెనుక.. లెక్కల్లో కనిపించని వేలాది కుటుంబాల కన్నీటి కథలున్నాయి. అందుకే ‘రణబాలి’ని కేవలం ఓ పీరియాడిక్‌ యాక్షన్‌ సినిమాగా చూడలేం. ఓ విపత్తు మనిషి జీవితాన్ని ఎంతలా మార్చగలదు? అణచివేతను ఎదుర్కొంటున్న ప్రజల్లో తిరుగుబాటు ఆలోచన ఎలా పుడుతుంది? తమ నేల, తమ మనుషుల కోసం కొందరు ఎందుకు పోరాట బాట పడాల్సి వచ్చింది? వంటి ఎన్నో ప్రశ్నలకు కథ రూపంలో సమాధానం చెప్పే ప్రయత్నమే ఈ సినిమా.