అన్‌నోన్ కాల్స్‌కు చెక్: నవంబర్ 1, 2026 నుంచి అమల్లోకి కొత్త కాలర్ ఐడీ సిస్టమ్

అన్‌నోన్ కాల్స్‌కు చెక్: నవంబర్ 1, 2026 నుంచి అమల్లోకి కొత్త కాలర్ ఐడీ సిస్టమ్

దేశంలో మెుబైల్ యూజర్లు ఎదుర్కొంటున్న అన్‌నోన్ కాల్స్‌ సమస్యకు త్వరలోనే పూర్తిగా చెక్ పడనుంది. స్కామ్ కాల్స్, మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే దేశంలోని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా అధికారిక కాలర్ ఐడీ సిస్టమ్‌ అయిన 'కాల్లింగ్ నేమ్ ప్రెజెంటేషన్' సేవలను 2026 నవంబర్ 1 నుంచి తప్పనిసరిగా అమలు చేయాలని టెలికాం శాఖ స్పష్టం చేసింది. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే ఫోన్ కాల్ రాగానే అవతలి వ్యక్తి అసలు పేరు స్క్రీన్‌పై కనిపిస్తుంది.

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. 4G, 5G మొబైల్ నెట్‌వర్క్‌లను వాడుతున్న ప్రతి యూజర్‌కూ ఈ కాలర్ ఐడీ సేవలు డిఫాల్ట్‌గా అందుబాటులోకి రానున్నాయి. అయితే 2G, 3G నెట్‌వర్క్‌లు.. పబ్లిక్ స్విచ్డ్ టెలిఫోన్ నెట్‌వర్క్‌ల విషయంలో ఈ సేవలను ఏ విధంగా అమలు చేయాలనే దానిపై భవిష్యత్తులో ప్రత్యేకంగా పరిశీలించనున్నారు.

ఈ కాలర్ ఐడీ సిస్టమ్ ఎలా పనిచేస్తుందనే విషయానికొస్తే.. ఫోన్ కాల్ వచ్చినప్పుడు స్క్రీన్‌పై మొదటి వరుసలో కాలర్ నంబర్ కనిపిస్తుంది. ఇక రెండో వరుసలో ఆ కాలర్ పేరు డిస్‌ప్లే అవుతుంది. ఒకవేళ ఆ నంబర్ రిసీవర్ కాంటాక్ట్ లిస్ట్ లో సేవ్ చేయబడి ఉంటే.. మనం సేవ్ చేసిన పేరు కనిపిస్తుంది. అలా కాకుండా నంబర్ సేవ్ చేయకపోతే.. డొమెస్టిక్ కాల్స్ విషయంలో ఆ టెలికాం ఆపరేటర్ సబ్‌స్క్రైబర్ డేటాబేస్‌లో ఏ పేరు నమోదై ఉందో అదే పేరు స్క్రీన్‌పై కనిపిస్తుంది. అదే ఆకవేళ విదేశాల నుంచి వచ్చిన కాల్స్ అయితే స్క్రీన్‌పై స్పష్టంగా "ఇంటర్నేషనల్ కాల్" అని డిస్‌ప్లే అవుతుంది.

ఈ సరికొత్త విధానం అమలు కోసం ప్రతి టెలికాం ఆపరేటర్ ప్రత్యేకంగా ఒక డేటాబేస్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వినియోగదారుల పేర్లను వారి మొబైల్ నంబర్లతో అనుసంధానిస్తూ ఈ డేటాను మెయింటైన్ చేయాలి. కాల్ రిసీవ్ చేసుకునే ఆపరేటర్.. ఈ డేటాబేస్ నుంచే సబ్‌స్క్రైబర్ పేరును సేకరించి కాలింగ్ స్క్రీన్‌పై చూపించాలి. సైబర్ నేరాలు, ఫేక్ కాల్స్‌తో ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలకు కొత్తగా తెస్తున్న ఈ సౌకర్యం పెద్ద రిలీఫ్ అనే చెప్పుకోవాలి.