గ్లోబల్ మార్కెట్ల పతనంలో దూసుకుపోతున్న ఇండియన్ స్టాక్ మార్కెట్స్.. కారణం ఏంటంటే?

గ్లోబల్ మార్కెట్ల పతనంలో దూసుకుపోతున్న ఇండియన్ స్టాక్ మార్కెట్స్.. కారణం ఏంటంటే?

ఒకపక్క గ్లోబల్ మార్కెట్లు నష్టాల్లో సతమతం అవుతుంటే మరోపక్క మన స్టాక్ మార్కెట్లు దానికి పూర్తి భిన్నంగా రియాక్ట్ అవుతున్నాయి. ప్రధానంగా ఏఐ, టెక్నాలజీ స్టాక్స్ ప్రపంచ వ్యాప్తంగా నష్టాలను కలిగిస్తున్నాయి. సౌత్ కొరియా స్టాక్ మార్కెట్ సూచీ కోప్సీ, జపాన్ నిఖ్కీ ఊహించని విధంగా నష్టపోయాయి. అమెరికా రానున్న కాలంలో వడ్డీ రేట్లను ఇంకా పెంచుతుందనే భయాలు గ్లోబల్ మార్కెట్లను ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి. ఇదే ప్రభావం హాంకాంగ్, చైనా మార్కెట్లపై కూడా పడింది. చిప్ తయారీలో ఉన్న శాంసంగ్, ఎస్ కే హైనిక్స్ స్టాక్స్ పతనంతో ఏఐ రంగంపై కూడా ప్రభావం కనిపిస్తోంది. 

ఉదయం మంచి లాభాలతో ట్రేడింగ్ స్టార్ట్ చేసిన భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఉదయం 11.40 గంటల సమయంలో బుల్ జోరుతో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ సూచీ 1183 పాయింట్లు, నిఫ్టీ 341 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 485 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 51 పాయింట్ల లాభంతో ముందుకు సాగుతున్నాయి. భారత స్టాక్ మార్కెట్లను ప్రధానంగా ముందుకు నడిపిస్తున్న బులిష్ కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

1. ఐటీ షేర్ల జోరు:
మార్కెట్లో ఐటీ ఇండెక్స్ ఏకంగా 2.4 శాతం లాభపడింది. దీనితో కేవలం 3 సెషన్లలోనే ఈ ఇండెక్స్ సుమారు 8.3 శాతం మేర పుంజుకున్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ షేర్లు ఒక్కొక్కటిగా 3 శాతం వరకు వృద్ధిని నమోదు చేశాయి. హెచ్‌సీఎల్ టెక్ ఫలితాలు, ఆశాజనకమైన అంచనాలే ఐటీ రంగానికి కొండంత బలాన్ని ఇస్తున్నాయని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వి.కె. విజయ్‌కుమార్ తెలిపారు. మరోవైపు టెక్ మహీంద్రా, విప్రో షేర్లు వరుసగా 3.5%, 1.7% లాభాలతో ట్రేడయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో కరెక్షన్ కనిపిస్తున్నప్పటికీ, మన దేశంలో AI స్టాక్స్ నుంచి విదేశీ పెట్టుబడులు మళ్లీ మన మార్కెట్ల వైపు మళ్లే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

2. వాల్యూ బయింగ్: 
మార్కెట్లు గత 6 నెలల కనిష్ట స్థాయిల వద్ద ట్రేడవుతున్న తరుణంలో, దిగువ స్థాయిలలో ఇన్వెస్టర్లు విలువైన షేర్లలో కొనుగోళ్ల వైపు మొగ్గు చూపారు. దీని ఫలితంగా సెన్సెక్స్ అలాగే నిఫ్టీ కూడా లాభాల బాట పట్టి మార్కెట్లలో నూతన ఉత్సాహాన్ని నింపాయి.

3. టెక్నికల్ కారణాలు:
నిఫ్టీ సూచీ 22,600 స్థాయికి దిగువన ట్రేడైతేనే మార్కెట్లో బేరిష్ (నష్టాల) ధోరణి స్పష్టంగా కనిపిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. సెన్సెక్స్ వీక్లీ ఎక్స్‌పైరీ కారణంగా మార్కెట్లో ఒడిదుడుకులు కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నిఫ్టీ నిలకడగా కోలుకుంటే 22,750–22,850 స్థాయిలకు చేరుకోవచ్చని, ఒకవేళ 22,500 స్థాయికి దిగువకు పడిపోతే మాత్రం కొత్తగా అమ్మకాల ఒత్తిడి పెరుగుతుందని థిన్‌క్రెబ్లు సెక్యూరిటీస్ ఫౌండర్ గౌరవ్ ఉదాని హెచ్చరించారు. రాబోయే సెషన్లలో నిఫ్టీ గడచిన వారం గరిష్ట స్థాయి అయిన 22,776ని దాటితే 23,000-23,100 స్థాయిల వరకు పుంజుకునే అవకాశం ఉంది.

4. హెవీ వెయిట్ షేర్ల బలం:
మార్కెట్‌కు వెన్నెముకగా నిలిచే హెవీ-వెయిట్ ఫైనాన్షియల్స్, ప్రైవేట్ బ్యాంకుల షేర్లు వరుసగా 1%, 1.4% లాభపడ్డాయి. బెంచ్‌మార్క్‌లలో అత్యంత బరువైన రెండు స్టాక్సైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ పెరిగాయి. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో ప్లాట్‌ఫారమ్స్ మెగా ఐపీఓ కోసం ప్రాస్పెక్టస్ దాఖలు చేయడంతో షేర్ ధర 2.1% ఎగబాకింది. ఇదే క్రమంలో ఇతర బ్యాంకింగ్ స్టాక్స్ కూడా మంచి లాభాలతో ఇన్వెస్టర్లను ఉత్తేజరపుస్తున్నాయి.