రోజుకు 30 నిమిషాల వ్యాయామం.. ఫిట్నెస్ ఛాలెంజ్ స్వీకరించిన మంత్రి పొన్నం.. మరో తొమ్మిది మందికి ఛాలెంజ్

రోజుకు 30 నిమిషాల వ్యాయామం.. ఫిట్నెస్ ఛాలెంజ్ స్వీకరించిన మంత్రి పొన్నం.. మరో తొమ్మిది మందికి ఛాలెంజ్

హైదరాబాద్:  మంత్రి పొన్నం ప్రభాకర్ ఫిట్ నెస్ ఛాలెంజ్ లో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ విసిరిన ఖేలో తెలంగాణ బంధన్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ స్వీకరించిన మంత్రి.. 2026 అక్టోబర్ 15న మరో 9 మందికి ఛాలెంజ్ చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడిన మంత్రి.. క్రీడా మైదానాల ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ క్రీడలను తమ దైనందిన జీవితంలో భాగంగా మార్చుకుని ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. 
 
 ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 30 నిమిషాలు నడక, పరుగు, సైక్లింగ్, యోగా లేదా తమకు అనువైన శారీరక వ్యాయామం కోసం సమయం కేటాయించాలని సూచించారు. శారీరక దృఢత్వం వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా కుటుంబ, సామాజిక శ్రేయస్సుకు కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు.

ఫిట్‌నెస్‌పై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు తమ వ్యాయామానికి సంబంధించిన 27 సెకన్ల వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని, తొమ్మిది మంది మిత్రులను ట్యాగ్ చేశారు.  మరో తొమ్మిది మందిని ఫిట్‌నెస్ ఛాలెంజ్‌లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించాలని కోరారు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ భాగస్వాములైతే ఫిట్‌నెస్ ఉద్యమం ప్రజల్లోకి విస్తృతంగా చేరుతుందని అన్నారు.

ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఫిట్‌నెస్ ఛాలెంజ్

ఖేలో తెలంగాణ బంధన్ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయడంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సంజయ్ జాజు, రాష్ట్ర ప్రభుత్వ రవాణా శాఖ కార్యదర్శి, డీజీపీ సీవీ ఆనంద్ ,టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ నాగిరెడ్డి, రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్, వెల్ఫేర్ సెక్రటరీ రాహుల్ బొజ్జ, జీహెచ్ ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్,హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌ ప్రియాంక ఆలా లకు ఫిట్‌నెస్ ఛాలెంజ్ విసిరారు.

క్రీడలు కేవలం పోటీలు, పతకాలకే పరిమితం కాకుండా ప్రతి కుటుంబంలో, ప్రతి గ్రామంలో, ప్రతి విద్యాసంస్థలో క్రీడా సంస్కృతి పెంపొందాలని మంత్రి ఆకాంక్షించారు. చిన్నతనం నుంచే విద్యార్థుల్లో శారీరక వ్యాయామం, క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడం ద్వారా ఆరోగ్యవంతమైన తరాన్ని నిర్మించవచ్చని పేర్కొన్నారు.

బీసీ విద్యాసంస్థల్లో ఫిట్‌నెస్ కార్యక్రమాల విస్తరణ

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అన్ని విద్యాసంస్థల్లో ఖేలో తెలంగాణ బంధన్, ఫిట్‌నెస్ కార్యక్రమాలను మరింత ముమ్మరం చేసే దిశగా చర్యలు చేపడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు శారీరక దృఢత్వానికి ప్రాధాన్యమిచ్చేలా ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అధికారులు కన్నం మధు, సురేష్ కాలేరు తదితరులు పాల్గొన్నారు.