ఉప్పల్‌లో భారత్ ఓటమి.. మ్యాచ్‌లో ఏం మిస్సయ్యామో చెప్పిన శాంసన్

ఉప్పల్‌లో భారత్ ఓటమి.. మ్యాచ్‌లో ఏం మిస్సయ్యామో చెప్పిన శాంసన్

Sanju Samson: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్ 24 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ పరాజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్ 2–2తో సమం కాగా.. సిరీస్ విజేత ఎవరో తేల్చే నిర్ణయాత్మక ఆఖరి పోరు అక్టోబర్ 17 (శనివారం)న బెంగళూరులో జరగనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం భారత స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ (Sanju Samson) మీడియాతో మాట్లాడుతూ.. భారత బౌలర్లకు అండగా నిలిచాడు. ఈ ఓటమికి అసలు కారణాలను విశ్లేషించాడు.

భారత బౌలర్లకు సంజు సపోర్ట్: 

బుమ్రా లేని లోటుపై సంజు మాట్లాడుతూ.. జస్ప్రీత్ బుమ్రా తరహా బౌలర్ తరానికి ఒక్కరు మాత్రమే వస్తారని, అయితే మన యువ బౌలర్లు అనుభవంతో మరింత రాణిస్తారని శాంసన్ తెలిపాడు. బుమ్రా లాంటి బౌలర్ మనకు దొరకడం అదృష్టం.. కానీ మన దగ్గర కూడా అద్భుతమైన యువ ప్రతిభ ఉంది, అర్షదీప్ అద్భుతంగా రాణిస్తున్నాడు.. గత కొన్ని మ్యాచ్‌లలో ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ తీరు ఎంతో ఆకట్టుకుందదని ప్రశంసించాడు. యువ ఆటగాళ్లకు తగినన్ని అవకాశాలు ఇచ్చి, వెన్నంటి ఉంటే వారు భవిష్యత్తులో మరింత మెరుగైన ప్రదర్శన కనబరుస్తారని సంజు శాంసన్ అభిప్రాయపడ్డాడు.

తిలక్ వర్మ ఔట్ కావడమే టర్నింగ్ పాయింట్:

మేము లక్ష్య ఛేదనలో వేగంగానే దూసుకెళ్లాం.. కానీ తిలక్ వర్మ (43 పరుగులు) ఔట్ కావడమే మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్‌గా మారిందని సంజు శాంసన్ తెలిపాడు. ఆ సమయంలో నితీష్ కుమార్ రెడ్డి (41), తిలక్ (43) ఇన్నింగ్స్‌ను చక్కగా నిర్మించి బౌలర్లపై ఒత్తిడి తెచ్చారు. తిలక్ పెవిలియన్ చేరడంతో మా విజయావకాశాలను బాగా దెబ్బతీసిందని వెల్లడించింది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వంటి టాప్ ఆర్డర్ బ్యాటర్లు ప్రపంచంలోనే అత్యుత్తమమని, ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన వారిని తక్కువ అంచనా వేయలేమని తేల్చి చెప్పాడు. 

షాయ్ హోప్ ఇన్నింగ్స్‌కు హ్యాట్సాఫ్: 

* వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ అద్భుతమైన సెంచరీ (102*) గురించి శాంసన్ మాట్లాడుతూ.. ఆయన ఎలాంటి రిస్క్ తీసుకోకుండా చాలా పరిణతితో బ్యాటింగ్ చేశాడని, ఆ ఇన్నింగ్స్‌ను మనం గౌరవించి తీరాలని ప్రశంసించాడు.

* ప్రస్తుతం సిరీస్ 2–2తో సమంగా ఉంది. అంతిమ పోరు శనివారం బెంగళూరులో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం మా జట్టు ఎంతో ఉత్సాహంగా ఉంది. వెస్టిండీస్ అద్భుతంగా ఆడుతోంది కాబట్టి వారికి క్రెడిట్ ఇవ్వాల్సిందే.. బెంగళూరులో గెలిచి సిరీస్ కైవసం చేసుకుంటామని సంజు శాంసన్ ధీమా వ్యక్తం చేశాడు.