ఉదయాన్నే ఇడ్లీ-దోశతో రోజును ప్రారంభించే ప్రజలకు, మధ్యాహ్నం సింపుల్ దాల్-రైస్ భోజనంపై ఆధారపడే వారికి త్వరలోనే తిండి ఖర్చులు మరింత భారం కానున్నాయి. ఎల్ నినో కారణంగా పెరిగిన బియ్యం, పప్పుధాన్యల ధరలతో రెస్టారెంట్లు తమ మెనూ రేట్లను 10 నుంచి 15 శాతం వరకు పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. దేశరాజధాని ముంబైలోని హోటళ్లు వచ్చేవారం నుంచి కొత్త రేట్లు అమలుకు సిద్ధం అవుతున్నాయి. పెరిగిన వంట గ్యాస్ ధరలు, నిత్యావసర సరుకులు, రవాణా ఛార్జీలు, అద్దెలు, ఉద్యోగుల వేతనాలు రెస్టారెంట్లను ఈ నిర్ణయం తీసుకునేలా చేసింది.
ముంబై నగరంలో దాదాపు 25వేలకు పైగా సభ్యులున్న ఇండియన్ హోటల్ & రెస్టారెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయ్ శెట్టి మాట్లాడుతూ.. రెస్టారెంట్లు వీలైనంత కాలం పెరిగిన ఖర్చులను భరించాయని.. కానీ ఇప్పుడు కష్టసాధ్యంగా మారిందని తెలిపారు. కమర్షియల్ గ్యాస్, పైప్డ్ గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడం, కూరగాయలు, పప్పుధాన్యాలు, పాలు, పాల ఉత్పత్తులు, వంట నూనెలు వంటి నిత్యావసరాల ధరలు, రవాణా ఖర్చులు పెరగడం రెస్టారెంట్ యజమానులకు తలనొప్పిగా మారిందని చెప్పారు.
ఎల్నినో ప్రభావం, రుతుపవనాల వైఫల్యం, దేశవ్యాప్తంగా ఏర్పడిన అనావృష్టి పరిస్థితులు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపాయి. సరఫరాలో ఏర్పడిన కొరత కారణంగా హోల్సేల్ మార్కెట్లలో పప్పు దినుసులు, కూరగాయల ధరలు అసాధారణంగా పెరిగాయి. దీనికి తోడు ముంబై లాంటి మహా నగరాల్లో విపరీతంగా పెరిగిన కమర్షియల్ రెంటల్స్, రియల్ ఎస్టేట్ ఖర్చులు, స్టాఫ్ శాలరీలు యజమానులను తీవ్ర నష్టాల్లోకి నెడుతున్నాయి.
ఈ ధరల పెంపు చిన్నదిగా అనిపించినప్పటికీ.. రోజూ బయటే తిండి తినే ఆఫీసు ఉద్యోగులు, విద్యార్థులు, డెలివరీలపై ఆధారపడే నిపుణులు కుటుంబాల నెలవారీ బడ్జెట్పై ఇది గట్టి ప్రభావం చూపనుంది. ఉదాహరణకు.. సాధారణంగా రూ.80 ఉండే ఇడ్లీ ధర రూ. 88 నుండి రూ.92కి, రూ.90 ఉండే సదా దోశ రూ.105 వరకు చేరే అవకాశం ఉంది. ఇక దాల్-రైస్, దాల్ ఖిచ్డీ లాంటి భోజనాల రేట్లు ప్రియమవనున్నాయి.
ALSO READ : ఇస్లాంలోకి మారితే ముస్లిం కోటా కింద రిజర్వేషన్ వర్తించదు
రోజువారీగా టిఫిన్, లంచ్ల కోసం సుమారు రూ.150 ఖర్చు చేసే ఆఫీసు ఉద్యోగికి ఈ పెంపు కారణంగా నెలవారీ ఖర్చు అదనంగా మరో రూ.400 నుంచి రూ.600 వరకు పెరుగుతుంది. ఒక కుటుంబంలో ఇద్దరు ఉద్యోగులు ఉంటే ఈ అదనపు భారం నెలకు వెయ్యి రూపాయలకు పైగా దాటవచ్చు. ఈ పెంపును ఏకపక్షంగా అన్ని రెస్టారెంట్లు ఒకేసారి అమలు చేయవని, ఆయా హోటళ్ల నిర్వహణ ఖర్చులు, వ్యాపార నమూనాలను బట్టి ఎవరికి వారు స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటారని ఏహెచ్ఏఆర్ స్పష్టం చేసింది. రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లోని రెస్ట్రారెంట్లు, హోటల్స్ కూడా ఇదే విధంగా తమ రేట్లను పెంచే అవకాశం ఉందని ఫుడ్ ఇండస్ట్రీ నిపుణులు అంటున్నారు.
