కోల్‌బెల్ట్, వెలుగు: సింగరేణి సంస్థ 2025-–26 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన రూ.1,754 కోట్ల లాభాల్లో 34 శాతం వాటా కింద రూ.596.36 కోట్ల బోనస్‌ను ఈనెల 16న కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ విషయాన్ని సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ బుధవారం వెల్లడించారు.
సంస్థలో పనిచేస్తున్న 38,737 మంది పర్మినెంట్ కార్మికులకు సగటున ఒక్కొక్కరికీ రూ.1,53,912 బోనస్ అందనుండగా, 29,717 మంది కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 చొప్పున చెల్లించనున్నారు. పర్మినెంట్ కార్మికులకు వారు పనిచేసే గని, విభాగం, హాజరు ఆధారంగా బోనస్ లెక్కిస్తారు. భూగర్భ గనుల్లో పనిచేసే వారికి ఒక్కో మస్టరుకు రూ.602.26, ఓపెన్‌కాస్ట్ గనులు, ఎస్టీపీపీ, సీహెచ్‌పీ, ఇతర సర్ఫేస్ శాఖలో పనిచేస్తున్న వారికి రూ.476.78, ఇతర డిపార్ట్మెంట్ల ఉద్యోగులకు రూ.440.11 చొప్పున చెల్లించనున్నారు.
ఏడాది కాలంలో నమోదైన మస్టర్ల ఆధారంగా బోనస్ మొత్తం నిర్ణయించి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, న్యాయమైన ప్రయోజనాల సాధనకు ఏఐటీయూసీ నిరంతరం కృషి చేస్తుందని నాయకులు స్పష్టం చేశారు.
