టాయి లెట్ లేని బడి ఉండొద్దు..రూ.208.91 కోట్లతో విద్యాశాఖ మెగా ప్లాన్

టాయి లెట్ లేని బడి ఉండొద్దు..రూ.208.91 కోట్లతో విద్యాశాఖ మెగా ప్లాన్
  •     ఆడపిల్లల డ్రాపౌట్లకు చెక్.. రన్నింగ్ వాటర్, గోప్యతకు పెద్దపీట 

హైదరాబాద్, వెలుగు: సర్కారు బడుల్లో మరుగు దొడ్ల సమస్యను సమూలంగా పరిష్కరించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. సమగ్ర శిక్షా అభియాన్ కింద మొత్తం రూ.208.91 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా 3,746 స్కూళ్లలో 4,355 కొత్త టాయిలెట్ యూనిట్లు నిర్మించబోతున్నది. ఈ 2026–27 విద్యా సంవత్సరం నాటికి ఏ ఒక్క బడిలోనూ టాయిలెట్ల కొరత ఉండకూడదన్న లక్ష్యంతో వంద శాతం ‘శానిటేషన్ శాచురేషన్’సాధించే దిశగా చర్యలు చేపట్టింది.

బాలికల ఆత్మగౌరవానికి భరోసా..

సర్కారు బడుల్లో బాలికలు ప్రైమరీ లెవల్ నుంచి హైస్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చేసరికి డ్రాపౌట్లు పెరిగిపోవడానికి ప్రధాన కారణం ‘టాయిలెట్ల లేమి’అని క్షేత్రస్థాయి పరిశీలనల్లో తేలింది. నెలసరి సమయంలో పడే ఇబ్బందులు, కనీస నీటి సౌకర్యం లేకపోవడంతో వేలాది మంది బాలికలు రోజువారీ తరగతులకు గైర్హాజరవుతున్నారు. చాలాచోట్ల బడి మానేసే పరిస్థితి నెలకొంది. ఈ దుస్థితిని రూపుమాపేందుకు బాలికల కోసం ప్రత్యేకంగా రూ.57.17 కోట్లు, బాలుర కోసం రూ.151.74 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ప్రతి బడిలోనూ విద్యార్థుల నిష్పత్తికి తగినట్లుగా ప్రత్యేకంగా బాలుర, బాలికల మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మించనున్నారు. రాష్ట్రంలో శానిటేషన్ సమస్యను రెండు దశల్లో నిర్దిష్ట గడువుతో పూర్తిస్థాయి శాచురేషన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. గతేడాది2025–26 సంవత్సరంలో తొలి దశలో పీఎంశ్రీ స్కీము కింద ఎంపిక చేసిన 40 బడుల్లో రూ.2 కోట్ల వ్యయంతో 40 టాయిలెట్ యూనిట్లను మంజూరు చేశారు. దీనిలో బాలికల కోసం 19 బడుల్లో రూ.95 లక్షలు, బాలుర కోసం 21 బడుల్లో రూ.1.05 కోట్లు వెచ్చించి పైలట్ ప్రాజెక్టు కింద పనులు పూర్తిచేస్తున్నారు. 

ఈ ఏడాది రెండో విడతలో భారీ ఎత్తున పనులు చేపట్టనున్నారు. ఏకంగా 3,746 స్కూళ్లలో రూ.206.91 కోట్ల వ్యయంతో 4,315 కొత్త టాయిలెట్ యూనిట్లను నిర్మిస్తారు. దీనిలో బాలుర కోసం 3,143 యూనిట్లకు రూ.150.69 కోట్లు, బాలికల కోసం 1,172 యూనిట్లకు రూ.56.22 కోట్లను కేటాయించారు. ఈ పనులు పూర్తయితే రాష్ట్రంలో టాయిలెట్లు లేని సర్కారు బడి ఒక్కటి కూడా ఉండదని ఆఫీసర్లు స్పష్టం చేస్తున్నారు. గతంలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో టాయిలెట్ల నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోవడం, నాణ్యత లోపించడం వంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, ఈసారి నిర్మాణాల బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించనున్నారు.