ఎలక్షన్ కమిషన్ తో పాటు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. సర్ ప్రక్రియలో భాగంగా భారీ ఎత్తున ఓట్ల తొలగింపుపై నమోదైన పిటిషన్లను విచారిస్తున్న కోర్టు.. 2026 అక్టోబర్ 15న నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై ఇండియా కూటమి నేతలు వేసిన పిటిషన్లను చీఫ్ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్మల్యా బాగ్చి నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తున్న సందర్భంగా సీఈసీకి నోటీసులు జారీ చేసింది.
సర్ ప్రక్రియలో అవకతవకలు, ఓట్ల తొలగింపు వ్యవహారంలో సీఈసీ పాత్ర ఉందని ఆరోపిస్తూ ఆయనకు వ్యతిరేకంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మరో పది మంది పార్టీ నాయకులతో సహా కీలక ప్రతిపక్ష నాయకులు వ్యక్తిగత పిటిషన్లను దాఖలు చేశారు. వీరితో పాటు అసదుద్దీన్ ఒవైసీ, దిగ్విజయ్ సింగ్ కూడా వేర్వేరు పిటిషన్లను దాఖలు చేశారు. సర్ రివిజన్ ప్రక్రియను తక్షణమే నిలిపివేసి, రిటైర్డు సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఒక స్వతంత్ర కమిటీని నియమించాలని పిటిషనర్లు కోర్టును కోరారు. తొలగించిన ఓట్లకు సంబంధించి బూత్ వారీగా అన్ని వివరాలను వెల్లడించేలా ఆదేశించాలని.. అదే విధంగా అంతర్గతంగా కమిషనర్ల మధ్య జరిగిన చర్చలు, నిర్ణయాలకు సంబంధించిన అంశాలను కూడా వెల్లడించాలని పేర్కొన్నారు.
మొత్తం ఆ అంశానికి సంబంధించిన నలభై ఆరు పిటిషన్లకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించింది కోర్టు. పిటిషనర్ల తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాదులు, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాతో కలిసి వివిధ చట్టపరమైన సవాళ్లను వివరించారు.
విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది గౌరవ్ భాటియా ఇండియా కూటమి నేతల నిరసన తీరును ఆక్షేపించారు. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై బయట రాజకీయ ఊరేగింపులు, ర్యాలీలు నిర్వహించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, కోర్టుపై ఒత్తిడి తెచ్చేందుకే ఇదంతా చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ, న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు అని తేల్చిచెప్పారు. కోర్టును ప్రభావితం చేసేందుకు జరిగే ఇలాంటి బలహీనమైన ప్రయత్నాలను ఎవరూ పట్టించుకోరని అన్నారు. తాము ప్రపంచానికి దూరంగా ఏకాంతంలో కూర్చోలేదని, చుట్టూ ఏం జరుగుతుందో తమకు పూర్తి అవగాహన ఉందని ఘాటుగా స్పందించారు.
ఇదే క్రమంలో అక్టోబర్ 12న సుప్రీంకోర్టు ప్రాంగణంలో జరిగిన నిరసనకు సంబంధించిన పూర్తి సీసీటీవీ రికార్డులను భద్రపరచాలని న్యాయస్థానం ఆదేశించింది. ఎన్నికల సంఘం నిర్ణయాలపై దాఖలైన పిటిషన్లకు సంబంధించి కోర్టు నోటీసులు జారీ చేసినప్పటికీ, ఆ నిర్ణయం రాజకీయ నేతల తీరును సమర్థించినట్లు లేదా వారి ప్రవర్తనను క్షమించినట్లు కాదని ధర్మాసనం స్పష్టం చేసింది.
