ఆకలి వేస్తోందనే తొందరలో చేతులు క్లీన్ చేసుకోకుండా అన్నం తినేస్తుంటారు. బాత్రూమ్కు వెళ్లి వచ్చిన తర్వాత కూడా చేతులు శుభ్రం చేసుకోవడాన్ని కొందరు నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇలాంటివారికి చేతులు క్లీన్ చేసుకోమని చెప్పే రోజు 'గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే'. అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా ఈ డేను సెలబ్రేట్ చేసుకుంటారు. 'చేతులు క్లీన్గా ఉండేలా చూసుకోండి' అనే థీమ్తో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ డేను సెలబ్రేట్ చేస్తోంది. చేతులు శుభ్రం చేసుకోవడమనేది చాలా సింపుల్ విషయం. కానీ.. ఈ చిన్న పనికి కూడా బద్దకించి చాలా మంది పెద్ద పెద్ద జబ్బుల బారిన పడుతుంటారు. అందుకే ప్రతి ఏడాది హ్యాండ్ వాషింగ్ డేను జరుపుతున్నారు.
చేతులు సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే.. ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. ఇందులో.. మొదటిది డయేరియా, చేతులు సరిగ్గా కడగకపోవడం వల్ల పొట్ట లోపలికి వైరస్ పోతుంది. దీంతో.. పొత్తి కడుపులో నొప్పి, వాంతులు, విరేచనాలు అవుతాయి. ఈ అతిసార వ్యాధితో బాధపడే ఐదేళ్ల లోపు చిన్నారుల్లో ప్రతీ ఏటా లక్షల మంది చనిపోతున్నారు. అలాగే చేతులు కడగక పోవడం వల్ల జలుబు, ఫ్లూ, జ్వరం వంటి రోగాల బారిన కూడా చిన్నారులు పడుతున్నారు.
ముఖ్యమైన సందర్భాల్లో.. క్లీనింగ్ మస్ట్. ఆహార పదార్థాలు ముట్టుకునే ముందు.. భోజనం చేసేటప్పుడు, బాత్రూమ్లు ఉపయోగించిన తరువాత కచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకుని తీరాలి. చేతులు శుభ్రం చేసుకోకుండా ఏమైనా తింటే వైరస్ని నేరుగా శరీరం లోపలికి పంపుతున్నట్లే. బాత్రూమ్ ఉపయోగించిన తర్వాత చేతులు కడగకపోయినా ప్రమాదమే. అందుకే ఇలాంటి కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో మస్ట్గా చేతులు కడగాలి.
ఆహారం తినే ముందు చేతులు క్లీన్ చేసుకోవడం ఎంత అవసరమో.. వంట చేసే ముందు కూడా. అంతే అవసరం. చాలామంది వంటంతా పూర్తయిన తర్వాత చేతులు కడగటం, లేదంటే స్నానం చేయడం చేస్తుంటారు. కానీ.. వంట చేసే ముందు చేతులను, శరీరాన్ని శుభ్రం చేసుకుంటే వంట గిన్నెలు, ఆహార పదార్ధాల పైకి వైరస్, బ్యాక్టీరియా షిఫ్ట్ అవ్వకుండా ఉంటుంది.
నీళ్లతోనే ఎక్కువగా చేతులు కడగడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. కచ్చితంగా సబ్బు లేదా హ్యాండ్ వాష్ ఉపయోగించాలి. చేతులను కచ్చితంగా రెండు నిమిషాల పాటు శుభ్రం చేయాలి. అరచేతులు, గోళ్లు, వేళ్ల సందుల్లో మరింత ఎక్కువగా క్లీన్ చేసుకోవాలి. ముక్కు చీదినా, చేయి అడ్డుపెట్టుకుని దగ్గినా, చెత్తను, పెంపుడు జంతువులను ముట్టుకున్నా కచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకోవడం మంచిది. ఆ తరువాత చేతులను మెత్తని, పొడి బట్టతో తుడవడం వల్ల చేతులపై ఉన్న వైరస్ పూర్తిగా చనిపోతుంది.
