టీమిండియాకు బిగ్ షాక్.. 2017 వరల్డ్ కప్ హీరో గుడ్‌బై

టీమిండియాకు బిగ్ షాక్.. 2017 వరల్డ్ కప్ హీరో గుడ్‌బై

Punam Raut: భారత మహిళా క్రికెట్ జట్టు సీనియర్ బ్యాటర్, 2017 వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్ హీరో పూనమ్ రౌత్ (Punam Raut) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. నిన్న (2026, అక్టోబర్ 15, గురువారం ) రాత్రి సోషల్ మీడియా వేదికగా ఆమె తన నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించింది. గత కొన్ని సంవత్సరాలుగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న పూనమ్.. మొత్తానికి తన సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికింది. ముంబై వీధుల నుంచి మొదలైన తన క్రికెట్ ప్రయాణం ఎంతో మధురమైన జ్ఞాపకాలను మిగిల్చిందని ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

అద్భుతమైన అంతర్జాతీయ కెరీర్:

* దశాబ్ద కాలానికి పైగా కొనసాగిన పూనమ్ రౌత్ కెరీర్‌లో భారత్ తరఫున అన్ని ఫార్మాట్లలోనూ విశేషమైన సేవలందించింది. 

* వన్డేలు (ODIs): 73 మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించి 2,299 పరుగులు సాధించారు. ఇందులో 3 శతకాలు ఉన్నాయి.

* టీ20లు (T20Is): 35 మ్యాచ్‌లలో 719 పరుగులు చేశారు.

* టెస్టులు (Tests): 4 టెస్టు మ్యాచ్‌లు ఆడి 264 పరుగులు నమోదు చేసింది. ఇందులో సౌతాఫ్రికాపై సాధించిన అద్భుతమైన సెంచరీ కూడా ఉంది.

* మొత్తం అంతర్జాతీయ క్రికెట్‌లో పూనమ్ రౌత్ 4 శతకాలు (3 వన్డేలు, 1 టెస్టు) బాదారు.

2017 ప్రపంచ కప్ చిరస్మరణీయ ఇన్నింగ్స్: 

క్రికెట్ అభిమానులు పూనమ్ రౌత్‌ను ఎప్పుడూ 2017 మహిళల వన్డే ప్రపంచ కప్ ప్రదర్శనతోనే గుర్తుంచుకుంటారు. ఆ టోర్నమెంట్‌లో అద్భుతంగా రాణించిన పూనమ్ మొత్తం 381 పరుగులు సాధించారు. ఐర్లాండ్‌పై అరుదైన శతకం బాదడంతో పాటు భారత్‌ను ఫైనల్ చేర్చడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఆ ఫైనల్‌లో భారత్ కేవలం 9 పరుగుల తేడాతో తృటిలో ప్రపంచ కప్‌ను కోల్పోయినప్పటికీ, పూనమ్ రౌత్ పోరాటం చరిత్రలో నిలిచిపోయింది.

పూనమ్ రౌత్ ఎమోషనల్ వీడ్కోలు: 

ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన రిటైర్మెంట్‌ను ప్రకటిస్తూ పూనమ్ రౌత్ ఇలా రాసుకొచ్చింది.. ముంబై వీధుల నుంచి భారత జెర్సీని ధరించే వరకు కొనసాగిన ఈ ప్రయాణం ఎంతో అద్భుతమైన వరం.. ఎన్నో త్యాగాలు, కష్టాలు, మరపురాని విజయాలు, కఠిన పాఠాలు, జీవితాంతం గుర్తుండిపోయే క్షణాలతో ఈ ప్రయాణం సాగింది. 

భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం అనేది కేవలం కల నెరవేరడం మాత్రమే కాదు, నేను ఎంతో గర్వంగా మోసిన గొప్ప బాధ్యత అని పూనమ్ రౌత్ తెలిపింది. నా అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలుకుతున్న ఈ తరుణంలో నన్ను నమ్మి, వెన్నంటి నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.. క్రికెట్ నాకు కేవలం కెరీర్‌ను మాత్రమే ఇవ్వలేదు.. ఒక గుర్తింపును, కుటుంబం లాంటి బంధాలను ఇచ్చిందని వెల్లడించింది. 

క్రికెట్ తనకు సర్వస్వం ఇచ్చిందని, ఇకపై కోచింగ్ లేదా కామెంటరీ రూపంలో ఆటకు తిరిగి తన వంతు సేవలు అందిస్తానని (Giving back to the game) పూనమ్ సంకేతాలు ఇచ్చింది. నాలోని ఆటగాడు పక్కకు తప్పుకోవచ్చు, కానీ ఈ ఆటపై నాకున్న ప్రేమ ఎప్పటికీ రిటైర్ కాదని ఆమె ఎక్స్ వేదికగా రాసుకొచ్చింది.