తెలంగాణలో 425 కోట్లతో .. 37 ఆటోమేటెడ్ వెహికల్ టెస్టింగ్ స్టేషన్లు

తెలంగాణలో 425 కోట్లతో .. 37 ఆటోమేటెడ్ వెహికల్ టెస్టింగ్ స్టేషన్లు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వాహనాల ఫిట్‌నెస్ పరీక్షలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల (ATS) ఏర్పాటుకు రూ.425.50 కోట్ల వ్యయంతో సవరించిన పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది.

ఈ మేరకు రవాణా, రహదారులు, భవనాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.గతంలో ఒక్కో స్టేషన్‌కు రూ.8 కోట్ల చొప్పున మొత్తం రూ.296 కోట్లకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. తాజాగా ఒక్కో స్టేషన్ నిర్మాణ వ్యయాన్ని రూ.11.50 కోట్లకు పెంచుతూ సవరించిన అనుమతులు మంజూరు చేసింది.

రెండు దశల్లో 37 స్టేషన్ల ఏర్పాటు

మొదటి దశ: మొత్తం 15 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. అప్పటి జిల్లా ప్రధాన కార్యాలయాల్లో ఒక్కొక్కటి చొప్పున, గ్రేటర్ హైదరాబాద్‌/హెచ్‌ఎండీఏ పరిధిలో అదనంగా నాలుగు స్టేషన్లను కలిపి ఈ దశలో నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకోసం రూ.172.50 కోట్లను కేటాయించారు.
రెండో దశ: మిగిలిన 22 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో స్టేషన్‌కు రూ.11.50 కోట్ల చొప్పున మొత్తం రూ.253 కోట్ల వ్యయాన్ని ఈ దశకు ఆమోదించారు.

ఈ 37 స్టేషన్ల ఏర్పాటు, నిర్వహణ కోసం రవాణా శాఖ పరిధిలో ప్రత్యేక ప్రయోజన వాహనం (SPV) ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ సంస్థ స్వయం ఆర్థిక నమూనాలో పనిచేయనుంది. స్టేషన్ల నిర్మాణానికి అవసరమైన నిధులను హడ్కో (HUDCO) వంటి బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాల రూపంలో సమీకరించనున్నారు.వాహనాల ఫిట్‌నెస్ పరీక్షలకు సంబంధించి వసూలు చేసే దరఖాస్తు రుసుము, పరీక్ష రుసుము, వినియోగదారు ఛార్జీలను ఎస్పీవీ నిర్వహించే ప్రత్యేక నిధిలో జమ చేస్తారు. ఈ నిధులను స్టేషన్ల ఏర్పాటు, నిర్వహణ కోసం తీసుకున్న రుణాల అసలు, వడ్డీ చెల్లింపులకే వినియోగించనున్నారు.

రవాణా కమిషనర్‌కు బాధ్యతలు

ఎస్పీవీ ఏర్పాటు, దాని కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన సంస్థాగత నిర్మాణం, విధివిధానాలు, ఆర్థిక నమూనాను రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాలని తెలంగాణ రవాణా కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.