డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను ఆమోదించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నెలాఖరులో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ బిల్లులను ఆమోదించడానికి లోక్సభలో అవసరమైన మద్దతు కూడగట్టేందుకు కూడా కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
ప్రత్యేక ఓటర్ల లిస్ట్ సవరణ (SIR), ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు నిరసనలు కొనసాగిస్తున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. డీలిమిటేషన్తో పాటు లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే అంశాలపై రాజ్యాంగ సవరణ బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
బిల్లుల ఆమోదంపై కేంద్రం ధీమా
ఈ బిల్లులను ఆమోదించుకునేందుకు అవసరమైన సంఖ్యాబలం తమకు ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బిల్లులపై ఓటింగ్ జరిగే సమయానికి మరింత మద్దతు కూడగట్టుకునేందుకు ప్రతిపక్ష పార్టీలతోనూ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అయితే, రాజ్యాంగ సవరణ బిల్లులు ఆమోదం పొందాలంటే పార్లమెంట్లో ప్రత్యేక మెజారిటీ అవసరం. ప్రస్తుతం లోక్సభలో ఎన్డీయేకు మెజారిటీ ఉన్నప్పటికీ, మూడింట రెండొంతుల మెజారిటీ సాధించడం కీలకంగా మారింది.
గతంలో ఎదురుదెబ్బ.. ఇప్పుడు మళ్లీ ప్రయత్నాలు
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు గత ఏప్రిల్ 17న బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్సభలో ఆమోదం పొందలేదని నివేదిక పేర్కొంది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో మరోసారి బిల్లులను ఆమోదించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం లోక్సభలో 540 మంది సభ్యులు ఉన్నారని, గత సమావేశాల తర్వాత తృణమూల్ కాంగ్రెస్కు చెందిన 20 మంది ఎంపీలు, శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీలు అధికార పక్షానికి మద్దతుగా మారడంతో ప్రభుత్వ బలం పెరిగిందని ప్రభుత్వ వర్గాలు తెలిపినట్లు సమాచారం.
డీఎంకేతో చర్చలు
బిల్లులకు మద్దతు కూడగట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు చెందిన డీఎంకేతో కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. తమిళనాడు ఎన్నికల తర్వాత కాంగ్రెస్తో ఆ పార్టీకి విభేదాలు ఏర్పడి, అనంతరం ఇండియా కూటమి నుంచి వైదొలిగిన నేపథ్యంలో ఈ చర్చలకు ప్రాధాన్యం ఏర్పడింది.
మరోవైపు, లోక్సభలో సంఖ్యాబలాన్ని పెంచుకునేందుకు కొన్ని చిన్న ప్రతిపక్ష పార్టీలతోనూ కేంద్రం సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ప్రత్యేక సమావేశాల తేదీలు ఎప్పుడు?
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 13న ముగిసిన, వాటిని అధికారికంగా నిరవధికంగా వాయిదా వేయలేదని సమాచారం. దీంతో ప్రభుత్వం ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి.
అక్టోబర్ 26, 27 తేదీల్లో సంవిధాన్ సదన్లో జరగనున్న 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్ను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక సమావేశాల తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది. సమావేశాలు నిర్వహించాలంటే వారం రోజుల ముందుగా నోటీసు ఇవ్వవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
అయితే, ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల నిర్వహణపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుల భవిష్యత్తుపై కేంద్రం తీసుకునే నిర్ణయం కీలకంగా మారనుంది.
