ఎల్‌నినో ఎఫెక్ట్: భారత్‌లో ఎండిపోతున్న చెరకు పంట, పడిపోతున్న దిగుబడి

ఎల్‌నినో ఎఫెక్ట్: భారత్‌లో ఎండిపోతున్న చెరకు పంట, పడిపోతున్న దిగుబడి

వాతావరణ మార్పులు, అంతర్జాతీయ యుద్ధాలు, ప్రకృతి ప్రకోపం కలగలిసి ప్రపంచ మానవాళికి తీపిని అందించే చెరకు పంటపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యధికంగా చక్కెరను వినియోగిస్తూ, రెండో అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉన్న భారత్‌లో ఈ సంక్షోభం తీవ్రంగా కనిపిస్తోంది. ఈ ఏడాది రుతుపవనాలు తీవ్రంగా దెబ్బతినడం, దానికి తోడు ఎల్ నినో ప్రభావం వల్ల దేశంలోని చెరకు పంట ఎండిపోయాయి.

భారత్‌లో ఈ ఏడాది వర్షాకాలం ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో.. మహారాష్ట్ర వంటి ప్రముఖ చక్కెర ఉత్పత్తి రాష్ట్రాల్లో చెరకు పొలాలు నీరులేక ఎండిపోతున్నాయి. మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. రైతులు 800 అడుగుల లోతు వరకు బోర్లు వేసినా నీరు పడక, మంజీరా నదీ పరీవాహక ప్రాంతం పూర్తిగా ఎండిపోయి బీడు భూమిగా మారింది. ఎరువుల ధరల పెరుగుదల, అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులకు ఈ ఎల్ నినో ప్రభావం కోలుకోలేని దెబ్బతీసింది. పంట దిగుబడి సాధారణం కంటే 70 నుండి 80 శాతం వరకు తగ్గిపోతుందని రైతులు వాపోతున్నారు.

కేవలం ఆహార అవసరాలకే కాకుండా.. దేశ ఇంధన భద్రతలోనూ చెరకు కీలక పాత్ర పోషిస్తోంది. మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన 'ఇథనాల్ బ్లెండింగ్' (E20) విధానంలో భాగంగా పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలపడం తప్పనిసరి చేశారు. ఇది క్రూడ్ ఆయిల్ దిగుమతులను తగ్గించడానికి ఉపయోగపడినప్పటికీ.. ప్రస్తుత చెరకు కొరత కారణంగా ఆ లక్ష్యానికి తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. చెరకు దిగుబడి పడిపోవడంతో ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న, బియ్యంపై ఆధారపడాల్సి వస్తోంది. అయితే వర్షాభావం వల్ల ఆ పంటలు కూడా దెబ్బతిన్నాయి.

ఈ కరువు పరిస్థితుల మధ్య పండుగల సీజన్ రావడంతో మార్కెట్లో చక్కెర ధరలు ఆకాశాన్ని అంటాయి. లడ్డూలు, మోదకాలు వంటి సాంప్రదాయ మిఠాయిల ధరలు 10 శాతానికి పైగా పెరిగాయి. ద్రవ్యోల్బణం, పెరిగిన ఆహార ధరలతో సామాన్యులు పండుగలకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. దేశంలో ధరల పెరుగుదలను నియంత్రించడానికి ప్రభుత్వం వర్తకులను హెచ్చరించడమే కాకుండా, సాధారణంగా ఎగుమతి చేసే దేశమైన భారత్ ఈసారి దిగుమతుల వైపు చూడవలసి వచ్చింది.

మొత్తంగా చూస్తే.. ఎల్‌నినో సృష్టించిన ఈ వాతావరణ మార్పులు కేవలం వ్యవసాయ రంగాన్ని మాత్రమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థను, సామాన్యుల జీవితాలను.. ఇంధన భద్రతను కూడా ప్రశ్నార్థకం చేశాయి. సరఫరా గొలుసులు ఎంతవరకు నిలకడగా ఉండగలవనే దానిపై ఇది పెద్ద సవాల్‌
 విసురుతోంది.