స్టార్‌లింక్ రాకను స్వాగతించిన రిలయన్స్.. పోటీకి సిద్ధమన్న ముఖేష్ అంబానీ

స్టార్‌లింక్ రాకను స్వాగతించిన రిలయన్స్.. పోటీకి సిద్ధమన్న ముఖేష్ అంబానీ

భారతీయ టెలికాం సేవల మార్కెట్‌లోకి ఎలాన్ మస్క్‌కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ 'స్టార్‌లింక్' ప్రవేశంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పందించింది. దేశంలో పెట్టుబడులు, ఆవిష్కరణలను తాము ఎప్పుడూ స్వాగతిస్తామని.. నిబంధనలకు లోబడి ఎవరైనా పోటీపడవచ్చని స్పష్టం చేసింది. అయితే విదేశీ సంస్థల నుంచి వస్తున్న ఆరోపణలను తిప్పికొడుతూ.. భారత్‌లో ప్రతి ఒక్కరూ చట్టప్రకారమే నడుచుకోవాలని ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గుర్తుచేసింది.

ఇదే సందర్భంలో ఎలాన్ మస్క్ గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించింది. స్టార్‌లింక్‌కు లైసెన్సులు ఇవ్వకుండా కొందరు గుత్తాధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇది భారతదేశానికి జరుగుతున్న అన్యాయమంటూ మస్క్ సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. అంతేకాకుండా భారత్‌లో అసలు అధికారం ఎవరి చేతిలో ఉందంటూ ప్రశ్నించారు. ఈ విమర్శలపై భారత ప్రభుత్వం స్పందిస్తూ.. నిబంధనలన్నీ పారదర్శకంగా ఉన్నాయని, భద్రతా అనుమతులు, స్పెక్ట్రమ్ కేటాయింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

స్టార్ లింక్ ఎంట్రీపై మస్క్ కామెంట్స్ వివాదంపై రిలయన్స్ స్పందిస్తూ.. తాము ఎప్పుడూ పోటీకి భయపడలేదని తెలిపింది. కేవలం 10 ఏళ్ల కిందట ఒక్క కస్టమర్ కూడా లేకుండా రంగంలోకి దిగిన జియో.. నేడు 53 కోట్ల మంది నమ్మకాన్ని సంపాదించి ఇండియాలో అత్యుత్తమ డిజిటల్ మౌలిక సదుపాయాలను అందించిందని గుర్తుచేసింది. స్టార్‌లింక్‌తో సహా శాటిలైట్ కమ్యూనికేషన్ రంగంలోకి వచ్చే ప్రతి పోటీదారునూ ఆహ్వానిస్తున్నామని.. అయితే దేశ చట్టాలకు, విధానాలకు అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని తేల్చిచెప్పింది.