ఎల్‌నినో ఎఫెక్ట్: హైదరాబాదులో రూ.90కి చేరిన కేజీ బియ్యం.. బస్తా రేటు రూ.500 అప్!

ఎల్‌నినో ఎఫెక్ట్: హైదరాబాదులో రూ.90కి చేరిన కేజీ బియ్యం.. బస్తా రేటు రూ.500 అప్!

ప్రజలు రోజువారీ ఆహారంలో భాగంగా వినియోగించే బియ్యం ధరలు హైదరాబాద్‌లో ఒక్కసారిగా దూసుకుపోతుండటంతో మధ్యతరగతి కుటుంబాల హోమ్ బడ్జెట్‌ చిన్నాభిన్నమవుతోంది. ప్రతీ ఇంటి వంటగదిలో ప్రధాన ఆహారమైన అన్నం రేట్లకు రెక్కలు రావడంతో సామాన్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

మార్కెట్లో సన్న రకం బియ్యం రిటైల్ ధర కిలో రూ.85 నుంచి రూ.90 వరకు పలుకుతోంది. గత 30 నుంచి 45 రోజుల్లోనే 25 కిలోల బస్తాపై రూ.300 నుంచి రూ.500 వరకు బియ్యం ధరలు పెరగటంతో సగటు మధ్యతరగతి ఫ్యామిలీపై భారం పెరిగింది. ఈ ధరల పెరుగుదలపై ఏఎస్‌రావు నగర్‌కు చెందిన అరుణా కుమారి మాట్లాడుతూ.. తమ నెలవారీ కిరాణా ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత నెలలో రూ.1,800 ఉన్న బియ్యం బస్తా ధర.. ప్రస్తుతం రూ.2వేలు దాటిందని, భవిష్యత్తులో ఈ ధరలు ఎంతవరకు పెరుగుతాయనే ఆందోళన కలుగుతోందని చెప్పారు.

రకాల వారీగా చూస్తే.. గతంలో రూ.1,500 ఉన్న 25 కిలోల బియ్యం బస్తా ఇప్పుడు రూ.1,900కి చేరింది. స్టీమ్ రైస్ బస్తా రూ.1,600 నుంచి రూ.2,200 వరకు ఎగబాకింది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో బ్రాండ్లు, ప్యాక్ సైజ్ ఆధారంగా ధరల్లో వ్యత్యాసాలు కనిపిస్తున్నప్పటికీ.. సామాన్యులకు ఇది మోయరాని భారంగా మారుతోంది.

వాతావరణ పరిస్థితులు, వర్షాభావం, ఎల్‌నినో ప్రభావం వంటి కారణాల వల్ల రాబోయే పంట దిగుబడిపై నీలినీడలు కమ్ముకున్నాయి. నిత్యావసర వస్తువులతో పాటు బియ్యం ధరలు కూడా ఇలాగే పెరిగితే పేద, మధ్యతరగతి ప్రజల ఆహార భద్రతపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మార్కెట్లో బియ్యం రేట్లు పెరగకుండా ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టాలని జనం కోరుకుంటున్నారు.